మహబూబ్ నగర్ జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహబూబ్ నగర్ జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

వెలుగు, నెట్​వర్క్ : మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా శివనామస్మరణతో మార్మోగాయి. ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు ఉపవాసాలు. జాగారం చేశారు. 

జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో 12 ఏండ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని వైభవంగా జరిపించారు. 108 ద్రవ్యాలతో చేసిన అమృత కలశానికి పూజలు చేసిన అనంతరం స్వామి, అమ్మవారి ఆలయ శిఖరాలకు కుంబాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్  సంతోష్ పాల్గొన్నారు. శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరంలో శివ పార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట మండలం పల్కపల్లి, భక్త మార్కండేయ ఆలయం, బల్మూర్​ మండలం గుడిబండ, గోదల్​రామలింగేశ్వర, కొండారెడ్డి, చంద్రమౌళీశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, ఎంపీ రాములు, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్​రెడ్డి తదితరులు పూజలు నిర్వహించారు. సోమశిలలోని లలితా సోమేశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ , ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. నాగ తెలకపల్లి మండలం గట్టునెల్లికుదురు గ్రామంలో నిర్వహించిన పార్వతీ, పరమేశ్వరుల కల్యాణంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి, మైసిగండి శివాలయం, అయ్యసాగర క్షేత్రంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

తలకొండపల్లి మండలం మల్లప్ప గుట్టపై నిర్వహించిన మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి దంపతులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ రూరల్​  మండలం మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. లింగాల మండల కేంద్రంలో శివపార్వతుల కల్యాణాన్ని హైదరాబాద్  మహంకాళి సీఐ శ్రీనివాసులు దంపతులు, వికారాబాద్  జిల్లా తాడూరు మెజిస్ట్రేట్  శివలీల దంపతులు జరిపించారు. 

మహాశివరాత్రి సందర్భంగా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లిలో సిద్దేశ్వర స్వామి జాతరను వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ప్రతిష్ఠించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మక్తల్​ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి, ఉమా మహేశ్వరాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పస్పుల దత్త కేత్రంలో నిర్వహించిన రథోత్సవానికి భక్తులు తరలివచ్చారు. అమ్రాబాద్​ మండలం బౌరాపూర్ లో ఆదివాసీ చెంచుల జాతరలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్​రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, అనురాధ దంపతులు పాల్గొని భ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి కల్యాణం జరిపించారు. అనంతరం మద్దిమడుగు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.