- జడ్చర్ల, నారాయణపేటలోనూ ఇదే సీన్
- మెయిన్ సెంటర్లలో పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్
- ఆక్రమణల్లో ఫుట్‌ఫాత్‌లు
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : మహబూబ్‌నగర్ నగరంతో పాటు మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బండ్లు నడపాలంటేనే వణికిపోవాల్సి వస్తోంది. ఈ టైంలో టూ వీలర్ మీద ఫ్యామిలీ పోవాలంటే సాహసమే చేయాల్సి వస్తోంది. ఏ బండి ఎటు వైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు ప్యాసింజర్లను ఎక్కించుకునేందుకు ఆటో డ్రైవర్లు ఎక్కడబడితే అక్కడ సడెన్ బ్రేకులు వేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పాలమూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య..
మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఇప్పుడు నగర పాలక సంస్థగా అభివృద్ధి చెందింది. అలాగే జనాభా కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రమైంది. నగరం వెలుపల నుంచే ఎన్‌హెచ్-167 వెళ్లడంతో నిత్యం వాహనాల రాకపోకలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంటోంది. అయితే రోడ్డుకు ఇరు వైపులా వాహనాలను పార్కింగ్ చేస్తుండడం ట్రాఫిక్ సమస్యకు కారణంగా తెలుస్తోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొద్ది స్థలాన్ని తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులు ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తుండడంతో ప్రధాన రోడ్డు కుచించుకుపోయింది.
వీటికి తోడు టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్ ముందు కస్టమర్లు అడ్డదిడ్డంగా బైకులను పార్క్ చేస్తుండడం సమస్యను మరింత త్రీవతరం చేస్తోంది. పాదాచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌ఫాత్‌ను సైతం వ్యాపారులు ఆక్రమించుకున్నా, మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. టీడీ గుట్ట, బోయపల్లి రైల్వే గేట్ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మార్గాల్లో రైల్వే ట్రాక్ ఉండడంతో రైళ్ల రాకపోకలతో ప్రతి అర గంటకోసారి గేటును మూయడం, తెరవడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆ రోడ్డులో హన్వాడ, పరిగి, తాండూరు, కోయిలకొండ వెళ్లే ఆర్టీసీ బస్సులు, కర్నాటక, ముంబై వెళ్లే భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి.
ఇదే ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఉండడంతో ఇక్కడికి వచ్చే ప్రజలు సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని తంటాలు పడుతున్నారు. కొత్త బస్టాండ్ ఏరియాలో ఆటోలను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. రోడ్డుపై ఆపుతూ వచ్చిపోయే వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక తూర్పు కమాన్, అశోక్ టాకీస్, బస్టాండ్, న్యూ టౌన్ ఏరియాల్లో యూ టర్న్‌లు లేకపోవడంతో ఫోర్ వీలర్స్, టూ వీలర్లు రాంగ్ రూట్లో వస్తున్నారు.
అలంకారంగా ట్రాఫిక్ సిగ్నల్స్..
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గతంలో నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ హైవే విస్తరణలో భాగంగా తొలగించారు. మూడేళ్ల కింద ప్రధాన చౌరస్తాలైన న్యూ బస్టాండ్, న్యూ టౌన్, మెట్టుగడ్డ, వన్ టౌన్, మల్లికార్జున చౌరస్తాల వద్ద వీటిని తిరిగి ఏర్పాటు చేశారు. కానీ, ఇంత వరకు ప్రారంభించలేదు. నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నా.. ఆ శాఖ ఆఫీసర్లు ఈ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురాకపోవడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణల్లో ఫుట్ పాత్‌లు..
నారాయణపేట జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నా ఫుల్పాత్లను వ్యాపారులు ఆక్రమించుకున్నారు. దీంతో రోడ్డు మీదుగా నడవాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా సరాఫ్ బజార్, బస్టాండ్, చిట్టెం నర్సిరెడ్డి విగ్రహం రోడ్డు, యాదగిరి రోడ్డు, పాత బస్టాండ్, సావర్కర్ చౌరస్తా, పాత చిన్న ఆసుపత్రి, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతోంది.
పారిశ్రామిక నగరంలోనూ ట్రాఫిక్ తంటా..
పారిశ్రామిక నగరంగా ఎదుగుతున్న జడ్చర్లలోనూ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. జడ్చర్ల న్యూ బస్టాండ్ వద్ద ఉన్న ఫ్లై ఓవర్, సిగ్నల్ గడ్డ, నిమ్మబాయి గడ్డ, నేతాజీ చౌరస్తా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జాంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఈ సమయాల్లో ఆయా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లి వచ్చే సమయాల్లో స్టూడెంట్లు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఘటనలు ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక సిబ్బంది, ఆధునిక సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా ఫుట్ పాత్‌లు పూర్తిగా ఆక్రమణకు గురవడంతో పాదచారులు రోడ్లపై నడుస్తున్నారు.
