శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి  వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో  మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. వేములవాడ  రాజన్న ఆలయంలో వచ్చే మూడు రోజుల పాటు కోడె మొక్కులు మినహా అన్ని ఆర్జిత సేవలు బంద్ చేశారు. 

మహా శివరాత్రి  సందర్భంగా ఉమ్మడి  వరంగల్ జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  అర్థరాత్రి నుంచే మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరంగల్ వేయిస్తంబాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.  మంత్రి ఎర్రబెల్లి  దయాకర్ రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వేయి స్థంబాల దేవాలయం, సిద్దేశ్వరాలయం, కురవి శ్రీ వీరభద్రేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా  భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాగారం, ఉపవాసం చేసే వారికొసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కూడా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శనానికి క్యూ కట్టారు. ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి, గోదారి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, మారేడు దళాలతో సమర్పిస్తున్నారు. 

నల్గొండ జిల్లాలోని పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంచి నీటి సౌకర్యం కల్పించారు. 

అటు ఏపీలోనూ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రం,  శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి  ఆలయం, మహానంది ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో అర్థరాత్రి  2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.

చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామి వారు శేష వాహనంపై.. అమ్మవారు యాలి వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శైవాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే  ఆలయాలకు  చేరుకున్న భక్తులు.. పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. కాశీ  విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. 

మధ్యప్రదేశ్  ఉజ్జయిని  మహంకాళ్ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  స్వామి వారికి  అర్చకులు పంచామృతాలతో  ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.  ప్రయాగ్ రాజ్‌లో  పుణ్యస్నానాలు  చేసి నది ఒడ్డున దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.  మరోవైపు  కుంబమేళ దగ్గర పడుతుండడంతో..  హరిద్వార్ విద్యుత్ కాంతులతో  మెరిసిపోతోంది. అక్కడ భక్తులు భారీ సంఖ్యలో  పుణ్యస్నానాలు చేస్తున్నారు. హర్ కీ పారీ ఘాట్ వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. గోరఖ్ పూర్‌లో జార్ఖండి మహాదేవ్ ఆలయంలో పరమేశ్వరున్ని మారేడు దళాలతో  భక్తులు పూజిస్తున్నారు. 

జమ్ము కశ్మీర్‌లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయంలో వైభవంగా పూజలు జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో శోభాయామానంగా అలంకరించారు. స్వామి వారికి భక్తులు పాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో శివాలయాలు కళ తప్పాయి. మహారాష్ట్ర నాసిక్‌లో త్రయంబకేశ్వర్, ముంబైలోని  బబుల్ నాథ్ ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.