- ఉలిక్కిపడిన రెవెన్యూడిపార్ట్మెంట్
- అక్రమాలపై ఆర్డీవోలకు విచారణాధికారం
యాదాద్రి, వెలుగు: భూ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌లో చీటింగ్ వెలుగులోకి రావడంతో యాదాద్రి జిల్లాలో కలవరం మొదలైంది. ఈ చీటింగ్ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉండడం, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ హనుమంతరావు సీరియస్‌గా స్పందించారు. ఇద్దరు ఆర్డీవోలను విచారణాధికారులుగా నియమించారు.
రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఫ్రాడ్..
రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌లో చీటింగ్ వ్యవహారం జనగామ జిల్లాలో వెలుగు చూసింది. దీంతో సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం ఏస్థాయిలో ఫ్రాడ్ జరిగిందనే దానిపై ప్రాథమికంగా విచారణ నిర్వహించింది. యాదాద్రి జిల్లాలో 1300 రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌లో అవకతకవకలు జరిగినట్టుగా గుర్తించింది. అయితే ఈ వ్యహారంలో జిల్లావ్యాప్తంగా కనీసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టుగా జిల్లా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అంచానా వేస్తున్నది. దీంతో పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు యాదాద్రి కలెక్టర్ హనమంతరావు చర్యలు ప్రారంభించారు.
మాన్యువల్‌గా చెకింగ్
ఈ చీటింగ్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిని కలెక్టర్ హనుమంతరావు విచారణాధికారులుగా నియమించారు. వీరిద్దరూ గడిచిన మూడు నుంచి నాలుగేండ్లలో జరిగిన భూ రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించి, వాటిని చెక్ చేయనున్నారు. జిల్లాలోని 17 మండలాల్లోని తహసీల్దార్ ఆఫీసుల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించాల్సి ఉంటుంది.
ప్రతి భూమి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఎక్కడ జరిగింది? భూమి మార్కెట్ విలువ ప్రకారం చలానా చెల్లించారా? లేదా? అన్నది పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత మొత్తం జమ అయిందో తేల్చనున్నారు. ఈ పరిశీలన పూర్తయితే కానీ ఏ స్థాయిలో ఫ్రాడ్ జరిగింది? అన్న విషయంలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే రికవరీ అంశం తెరపైకి రానున్నది. .
రెవెన్యూ వర్గాల్లో కలవరం
స్లాట్ బుకింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున జరిగిన చీటింగ్ వ్యవహారంలో వరంగల్ పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులే ఉన్నారా? ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో వరంగల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగినట్టుగా తేలడంతో రెవెన్యూ వర్గాల్లో కలవరం మొదలైంది.
భూమిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో డాక్యుమెంట్ రెండు లేదా మూడో పేజీలోని ‘ఎండార్స్‌మెంట్’ను పరిశీలిస్తే ఎంత మొత్తంలో చలాన్ చెల్లించారో తేలిపోతుంది. అయితే ఈ విషయాన్ని తహసీల్దార్లు పట్టించుకోకపోవడం వల్ల ఫ్రాడ్‌కు ఊతమిచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో తహసీల్దార్ల పాత్ర ఏ మేరకు ఉందన్న అంశంలో ఆరా తీస్తున్నారు.
అలాగే, ఈ ఫ్రాడ్‌లో మీ సేవ సెంటర్ల పాత్ర కూడా ఉందని జనగామలో తేలింది. దీంతో జిల్లాలోని మీ సేవ సెంటర్ల పాత్రపై అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. పైగా పెద్ద ఎత్తున ఇంటర్‌నెట్ సెంటర్లు, డాక్యుమెంట్ రైటర్లు స్లాట్ బుకింగ్ చేస్తూ ఉండడంతో ఈ ఫ్రాడ్‌లో వాటి నిర్వాహకుల పాత్ర కూడా ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పరిశీలించి.. ఆడిట్ చేస్తే
భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పర్యవేక్షణ కొరవడడంతోనే ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లను పరిశీలించి, ఆడిట్ చేస్తే ఖజానాలో జమ చేయాల్సిన మొత్తం ఎంత? ఎంత జమ అయింది? అనేది తేలేదని చెబుతున్నారు. అయితే స్లాట్ బుకింగ్ రద్దయిన వారికి పేమెంట్ తిరిగి ఇవ్వడం లేదు. రిటన్ చేసి ఉంటే ఈ చీటింగ్ విషయం అప్పుడే బయటపడేదని రెవెన్యూ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి స్థాయిలో విచారణ చేస్తం..
స్లాట్ బుకింగ్ వ్యవహారంలో జరిగిన చీటింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తం. ఆర్డీవోలను విచారణాధికారులుగా నియమిస్తున్నం. ప్రతి రిజిస్ట్రేషన్‌నూ నిశితంగా పరిశీలించి, ఏ స్థాయిలో ఫ్రాడ్ జరిగిందో గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నం. బాధ్యులైన వారి నుంచి డబ్బులు రికవరీ చేయడమే కాకుండా పీడీ యాక్ట్ , క్రిమినల్ కేసులు నమోదు చేస్తం.
- హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి
