ఒకే ఇంట్లో మొత్తం 92 ఓట్లు

 ఒకే ఇంట్లో మొత్తం 92 ఓట్లు
  • ఓటరు లిస్ట్​లో ఏండ్ల తరబడి ఉన్నా ఇప్పటికీ  కొందరికి ఏపీలో కూడా ఓట్లు

యాదాద్రి, వెలుగు: ఒకే ఇంటి నెంబర్​లో ఎంత మంది ఓటర్లు ఉంటారు. 5 నుంచి 10 మంది ఓటర్లు ఉంటారు.  కానీ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని ఓ ఇంటి నెంబర్, దానికి కొనసాగింపుగా బై నెంబర్లలో 92 మంది ఓటర్లు ఉన్నారు.  ఈ విధంగా ఆ ఇంటి నెంబర్​పై పదేండ్లకు పైగా ఓటర్లుగా కొనసాగుతూ ఓట్లు వేస్తున్నారు.  పైగా వారిలో కొంత మంది ఆంధ్రప్రదేశ్​లోనూ ఓటు హక్కుకలిగి ఉన్నారు. 

ఒకే చోట ఆరు నెలలు ఉంటే

ఒకే చోట ఆరు నెలలు నివాసం ఉంటే.. ఆ ప్రాంతంలో వారికి ఎన్నికల కమిషన్​ ఓటు హక్కు కల్పిస్తోంది. వారు ఉండేదీ తాత్కాలిక నివాసాల్లో అయితే వారు ఉంటున్న ఏరియాలో పక్కనే ఉన్న ఇండ్ల నెంబర్లను అడ్రస్​గా బీఎల్​వోలు నమోదు చేస్తారు. ఓటరు లిస్ట్​లో వారి పేర్ల పక్కనే నమోదు చేసిన ఇంటి నెంబర్​ఉంటుంది. 

3-133, బై నెంబర్లపై 92 ఓట్లు

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఆరో వార్డులో ఏపీకి చెందిన కొందరు ఏండ్ల తరబడి తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. వీరందరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే వీరి తాత్కాలిక నివాసాల పక్కనే ఉన్న ఇంటి నెంబర్​ 3-133ను అడ్రస్​గా చూపించారు. వీరిలో 15 మందిని 3-133 ఇంటి నెంబర్​పై ఓటర్లుగా చూపించారు. అదే విధంగా 133/1లో 13 మందిని, 133/1/1 లో 12 మందిని,   133/1/2లో 21 మంది సహా మిగిలిన వారందరినీ కూడా ఇలా ఈ బై నెంబర్లు ఉన్న ఇండ్లలో ఓటర్లుగా చూపించారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికలు సమీపించడంతో ఇటీవల రాజకీయపక్షాలతో కలెక్టరేట్​లో మీటింగ్​ నిర్వహించారు. ఈ మీటింగ్​లో యాదగిరిగుట్టలోని ఆరో వార్డులో ఒకే ఇంటి నెంబర్​పై 92 ఓట్లు ఉన్నాయని, ఎలా చేరుస్తారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

మున్సిపల్​ స్టాఫ్​ విచారణ

ఈ పరిణామంతో విచారణ చేయాలని కలెక్టర్​ హనుమంతరావు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఓటర్లు నివాసముంటున్నట్టుగా పేర్కొన్న ఇంటి వద్దకు మున్సిపల్​ స్టాఫ్​ వెళ్లి విచారణ చేశారు. అయితే తమ ఇంటి నెంబర్లలో ఓటర్లుగా ఉన్న వారిని తొలగించాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన తొలగించడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఓట్లను తొలగించే అధికారం తమకు లేదని మున్పిపాలిటీ సిబ్బంది పేర్కొన్న సిబ్బంది, విషయాన్ని మున్సిపల్​ కమిషనర్​కు నివేదించారు. 

పదేండ్లకు పైగా ఓటర్లుగా

తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న ఈ 92 మంది పదేండ్లకుపైగా ఇక్కడే ఉంటున్నారు.  మరికొన్ని వార్డుల్లోనూ వీరితో పాటు వచ్చిన వారు ఉంటూ ఓటర్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరందరూ కొన్ని రోజులు ఇక్కడే ఉంటూ మరికొన్ని రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకూ మూడు అసెంబ్లీ, మున్సిపాలిటీ, అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లోనూ వీళ్లు తమ ఓటు హక్కు యాదగిరిగుట్టలో వినియోగించుకున్నారు.

అయితే వీరిలో చాలా మందికి ఏపీలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరికి ఏపీకి చెందిన ఓటరు కార్డులు, తెలంగాణ ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు. వీరందరూ ఏపీలో ఎన్నికలు జరిగితే అక్కడ, తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఇక్కడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

ఫారం 7తో ఫిర్యాదు..  ఆధారాలు చూపిస్తే

అయితే వీరి ఓటు హక్కును తొలగించే అధికారం స్థానిక ఆఫీసర్లకు లేదు. వారిని తొలగించాలంటే ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుతోపాటు ఏపీలో ఓటు హక్కు కలిగి ఉన్నట్టుగా ఆధారాలను సైతం సమర్పించాల్సి ఉంటుంది.  ఆ తర్వాతే ఒక చోట వారి ఓటు హక్కును తొలగిస్తారు. లేని పక్షంలో వారు ఓటరుగా కంటిన్యూ అవుతారు.