- ధర్మదర్శనానికి రెండు, స్పెషల్ దర్శనానికి అరగంట
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపం.. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.
రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.39,22,539 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.16 లక్షలకు పైగా, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.89 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.5.10 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3,15,600 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఘనంగా నీరాటోత్సవాలు
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టలో గోదాదేవి అమ్మవారికి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం గోదాదేవికి ప్రత్యేక సేవ నిర్వహించారు. మొదట అమ్మవారికి నవకలశ తిరుమంజన స్నపనం నిర్వహించి అమ్మవారిని ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
