శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు
  • భక్తుల రద్దీ నియంత్రించేందుకు కేరళ హైకోర్టు మార్గనిర్దేశం

కేరళ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తుల తాడికి రోజు రోజుకూ పెరుగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దిగువన పంబ నుంచి సన్నిధానం వరకు ఆరు కిలో మీటర్లకు పైగా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామి దర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. 

రోజుకు 90 వేల మంది భక్తుల దర్శనం

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. రోజూ దాదాపు లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. రోజుకు సరాసరి 90వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నట్లు సమాచారం. సోమవారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో లక్ష మందికిపైగా భక్తులు దర్శనం కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. రద్దీ భారీగా పెరిగిపోవడంతో కేరళ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించి.. సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు కేరళ హైకోర్టు కూడా స్వామి దర్శనం సమయాన్ని ఒక గంటపాటు పెంచే అంశాన్ని పరిశీలించాలని ఆలయ అధికారులకు సూచించింది. 

అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిమల

అయ్యప్ప నామస్మరణతో శబరిమల మార్మోగుతోంది. ఇవాళ దర్శనం కోసం రికార్డు స్థాయిలో లక్షా 7 వేల 260 మంది భక్తులు ముందస్తు బుకింగ్  చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్ లో ఇదే అత్యధికంగా కాగా.. లక్ష మార్కు దాటడం మాత్రం రెండోసారి. భక్తుల రద్దీ భారీగా పెరగటంతో నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులను గ్రూపులుగా అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అడవి మార్గంలో ఎవరూ రావొద్దని, ప్రధాన మార్గంలోనే ఆలయానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ ఈనెల 27తో ముగుస్తోంది. దీంతో మకరవిళక్కు కోసం ఈనె 30న ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనంతో పూర్తవ్వనుంది. దీంతో ఈ సీజన్ లో పూజలు పూర్తైన తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించారు. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో అయ్యప్పను దర్శంచుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.