ఆధ్యాత్మికం :  దిశానిర్దేశం చేసేవే కావ్యాలు..  కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలో తెలుసా..!

ఆధ్యాత్మికం :  దిశానిర్దేశం చేసేవే కావ్యాలు..  కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలో తెలుసా..!

కావ్యాలు కేవలం కథల సమాహారాలు మాత్రమే కావు. అవి వేల ఏళ్లుగా మానవ పరిణామ క్రమాన్ని, నైతిక విలువలను, సామాజిక బాధ్యతను కాపాడుకుంటూ వస్తున్న అక్షర నిధులు. భాష ఒక జాతి ఆత్మ అయితే, ఆ భాషలో వెలువడిన సాహిత్యం ఆ ఆత్మకు రక్షణ కవచం. తెలుగు సాహిత్యంలో కావ్య ప్రక్రియకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. నన్నయ్య నుంచి నేటి వరకు కవులు రాసిన ప్రతి కావ్యం వెనుక ఒక అంతర్లీనమైన సందేశం, ఒక నైతిక విలువ దాగి ఉంటాయి. 

తెలుగు కావ్యాల్లో ముఖ్యంగా మహాభారతం గురించి చెప్పుకోవాలంటే, అది కేవలం యుద్ధం గురించి చెప్పేది కాదు. అది మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ధర్మ సందేహానికి సమాధానం ఇచ్చే గ్రంథం. నన్నయ్య, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించిన ఈ మహాకావ్యం మానవ స్వభావంలోని ఉన్నత స్థితిని, పతన స్థితిని రెండింటినీ చూపిస్తుంది.

 ధర్మం అంటే ఏమిటి? బంధుత్వం అంటే ఏమిటి? కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి? అనే ప్రశ్నలకు సమాధానంగా ధర్మరాజు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు వంటి పాత్రలు నిలుస్తాయి. వీరి పాత్రల ద్వారా కావ్యకర్తలు మనకు నేర్పిన పాఠం ఒక్కటే. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ధర్మం మిన్న. ఈ ధర్మం మనం బతికే విధానంలో కూడా ఉండాలని భారతం చాటి చెప్తోంది.

పోతన భాగవతంలో భక్తి కంటే మనిషికి ఉండాల్సిన వినయం, నిరాడంబరత్వం, సేవానిరతి కనిపిస్తాయి. గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు, అహంకారం ఎంతటి బలవంతుడినైనా ఎలా దెబ్బతీస్తుందో, భగవంతుడిని శరణు వేడడం అంటే నిస్సహాయత కాదు, తన తప్పును ఒప్పుకుని క్షమాభిక్ష కోరడం అనే పరిణతి అని చెప్తాయి. ఇవి కేవలం భక్తి పారవశ్యాలు కావు. మనిషి తనను తాను నియంత్రించుకోవడానికి కావాల్సిన మానసిక బలాలు. మనిషిలో అహంకారం తగ్గినప్పుడే మానవీయ విలువలు పెరుగుతాయి. ఈ సత్యాన్ని భాగవతం ఎంతో అద్భుతంగా ఆవిష్కరించింది.

నేటి సమాజంలో మనిషికి లేనిది ఓర్పు, సహనం. మన కావ్యాల్లోని నాయకులు కష్టాలను ఎదుర్కొనే విధానం నేటి తరానికి ఒక గొప్ప పాఠం. రామాయణం లాంటి కావ్యం స్త్రీ ధైర్యాన్ని, పురుషుడి బాధ్యతను, సమాజం పట్ల ఉండాల్సిన కట్టుబాట్లను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించింది. ఒక రాజకుమారిగా జన్మించిన సీత, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సామాన్య స్త్రీలా ప్రవర్తిస్తూ, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అనేది నేటి స్త్రీలకు కూడా ఒక ప్రేరణ. అలాగే రాముడు, తన వ్యక్తిగత సుఖం కంటే ప్రజల ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వడం నాయకత్వ లక్షణాలకు పరాకాష్ట. ఈ కావ్యాలు మనకు మనిషిగా, నాయకుడిగా ఎలా ఉండాలో దిశానిర్దేశం చేస్తాయి.

ప్రబంధాల కాలానికి వచ్చేసరికి, వస్తువు మారినా అందులోని మానవీయ విలువలు చెదరలేదు. ప్రకృతిని ఆరాధించడం, సౌందర్యాన్ని చూడటం, కళలను పోషించడం వంటివి కావ్యాల్లో భాగమయ్యాయి. ఇది మనిషి కేవలం జీవించడం కోసం కాదు, అందంగా జీవించడం కోసం కూడా కృషి చేయాలని చెబుతుంది. కవిత్వం అనేది మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని తగ్గించి, సున్నితత్వాన్ని పెంచే ఒక సాధనం అని కావ్యాలు నిరూపించాయి.

 దురదృష్టవశాత్తూ నేడు మన కావ్యాలను కేవలం లైబ్రరీల అరలకే పరిమితం చేశాం. వాటిలోని సారాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించడం లేదు. సాహిత్యం అంటే కేవలం కవుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం కాదు. ఆ సాహిత్యం చెప్పిన విలువలను మన ప్రవర్తనలో చూపడం.
నేటి తరం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సమాధానం మన కావ్యాల్లోనే ఉంది. కావ్యాల్లోని పాత్రలు ఎదుర్కొన్నంత కష్టం మనకు ఎదురుకాకపోవచ్చు. కానీ, మనం ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఒత్తిళ్లకే కుంగిపోతున్నాం. కావ్యాలు మనకు మనోబలాన్ని ప్రసాదిస్తాయి. పాత కావ్యాల్లో ప్రకృతిని ఒక స్త్రీగా, ఒక దైవంగా పూజించారు. 

నేడు మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కావ్యాలు మనల్ని పర్యావరణ స్పృహతో బతకమని హెచ్చరిస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా మానవత్వాన్ని చాటిన ఎందరో కవులు ఉన్నారు. ఆ బాటలో నడవడమే నిజమైన తెలుగుతనం.
 తెలుగు సాహిత్యం ఒక మహా సముద్రం. అందులో కావ్యాలు అనేవి రత్నాలు. మనం ఎక్కడినుంచి వచ్చామో, మన మూలాలు ఏమిటో తెలిసినప్పుడే మనకు ఒక గుర్తింపు ఉంటుంది. మన కావ్యాలు మనకు ఇచ్చిన ఆ గుర్తింపును, ఆ మానవీయ విలువలను మనం కాపాడుకోవాలి. మన అక్షరం సజీవంగా ఉన్నంతవరకు, మన విలువలు కాలంతో పాటు పయనిస్తాయి. మన కావ్యాల్లోని ఆ వెలుగులను మనం ఆస్వాదిద్దాం, మన ముందు తరాలకు ఆ వెలుగులను అందించే బాధ్యతను మన భుజస్కంధాలపై వేసుకుందాం. అప్పుడే మన సాహితీ ప్రయాణం సార్థకమవుతుంది, మన సంస్కృతి సుస్థిరం అవుతుంది.

- కాళేశ్వరం కృష్ణమూర్తి, తెలుగు భాషా బోధన నిపుణులు, హన్మకొండ-

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.