- నెరవేరనున్న రైతుల దశాబ్ధాల కల
- రామచంద్రాపురంలో 10వేల ఎకరాల్లో సర్వే పూర్తి
- జీయో ట్యాగింగ్ తో సమస్యకు శాశ్వత పరిష్కారం
- మంత్రి సీతక్క చొరవతో భూసమస్యకు మోక్షం
- జూన్ 2న పట్టాలు పంపిణీకి సన్నాహాలు
ములుగు, వెలుగు: నైజాం కాలం నుంచి ఉమ్మర్ ఖాన్ అనే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన వందల ఎకరాలను వదిలి హైదరాబాద్ లో స్థిరపడగా ప్రభుత్వం ఆ భూములను ఆధీనంలోకి తీసుకుంది. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్ రెవెన్యూ పరిధిలోని ఉమ్మర్ ఖాన్ భూములను స్థానిక రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. సుమారు 15 వేల ఎకరాల్లో రైతులు కాస్తు కబ్జాలో ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు సర్వే నిర్వహించి కబ్జాలో ఉన్న అర్హులైన రైతులకు 5 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు.
మిగతా 10 వేల ఎకరాల్లో రైతులు కాస్తులోనే ఉన్నా సర్వే నెంబర్లు మరో చోట ఉండడంతో సమస్యలు తలెత్తాయి. పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లభించలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనూ మోక్షం లభించలేదు. మంత్రి సీతక్క చొరవతో ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు.
10,514 ఎకరాలకు జియో ట్యాగింగ్ సర్వే పూర్తి..
మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం శివారులోని 10,514 ఎకరాల్లో భూములకు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సర్వే చేపట్టారు. 9 బృందాలతో సుమారు 70 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, ఆర్ఐలు, జీపీవోల సహకారంతో 9 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్ కు ఒక సర్వే బృందాన్ని నియమించి సర్వే పూర్తి చేశారు. ఆయా భూముల్లో కాస్తు కబ్జాలో ఉన్నవారు ఎవరు..? ఆధారాలు, చుట్టూ హద్దుల్లో ఉన్న వారితో విచారణ జరిపిన అధికారులు జియోట్యాగింగ్ తో పూర్తిడేటా ఆన్లైన్ లో పొందుపరిచారు.
1950, 1975, 2002– 2007 మధ్య ఈ భూములపై సర్వే చేసినా సరైన సేత్వార్ నిర్ణయించలేకపోయారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన సర్వే కొనసాగుతుండగా, ఏండ్ల నాటి వివాదాలకు బ్రేకులు పడ్డాయి. ఈ భూ సమస్యలపై గతంలో మంత్రి సీతక్క పలుమార్లు అసెంబ్లీలో లేవనెత్తారు. ప్రస్తుతం కలెక్టర్, తహసీల్దార్ల ఆదేశాల మేరకు డీటీ మమత పర్యవేక్షణలో రీ సర్వే జరుగుతుండగా పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.
జూన్ 2న పట్టాల పంపిణీ..!
రామచంద్రాపురం రెవెన్యూ భూముల సర్వే పూర్తికాగానే రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం 8,900ల మంది రైతులకు పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో రాంచంద్రాపూర్ రెవెన్యూ పరిధిలోని కొడిశెలకుంట, గుర్తూర్తండా, రాంచంద్రాపూర్, పందికుంట, శివతండా గ్రామాల పరిధిలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. డీటీ మమత, ఆర్ఐలు విజేందర్, కిరణ్, కుమార్, విష్ణు, జీపీవో శ్రీకాంత్, మహేందర్ సమక్షంలో సర్వే పూర్తిచేయగా, భూములపై స్పష్టత రావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సర్వే చేయడం సంతోషంగా ఉంది..
గతంలో సర్వే చేసిన అధికారులు కొంతమందికి కొన్ని ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం తాము కాస్తు చేసుకుంటున్న వాటికి పట్టాలు లేకపోవడంతో ఎలాంటి లోన్లు, ప్రభుత్వ పథకాలను పొందలేకపోయాం. మంత్రి సీతక్క చొరవతో ప్రస్తుతం మా భూములకు సర్వే నిర్వహించడం సంతోషంగా ఉంది. దీంతో ఎంతో మంది రైతులకు మేలు చేసినట్లు అవుతోంది. త్వరలో పట్టాలు అందిస్తారని ఆశిస్తున్నాం.- బేతి సాయిరెడ్డి, రాంచంద్రాపూర్ గ్రామస్తుడు
ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నాం..
రామచంద్రాపురం శివారులోని భూములను కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఈ భూములకు సంబంధించి సర్వే పెండింగ్ లో ఉంది. మోకా మీద ఎవరున్నారో పరిశీలించి పక్కా రికార్డు చేసి వివరాలు ఆన్లైన్ లో పొందుపరుస్తున్నాం. కొత్తగా ఎవరికీ పట్టాలు ఇవ్వడంలేదు. గతంలో కొంత మందికి పట్టాలు ఇచ్చి ఉన్నారు. సర్వే పూర్తికాని భూములను మాత్రమే సర్వేచేసి రికార్డుల్లో పొందుపరుస్తున్నాం.- వెంకటేశ్, ఆర్డీవో, ములుగు
