తమిళ స్టార్ హీరోయిన్ త్రిషకు ఇవాళ ప్రత్యేకమైన రోజు. సోమవారం (ఏప్రిల్ 4, 2026న) త్రిష తన 43వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా త్రిష ఆదివారం రాత్రే తిరుపతికి బయలుదేరిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులకు అప్డేట్ షేర్ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేసింది. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆమె భక్తులను చిరునవ్వుతో అభివాదం చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ గెలుపు కోసమేనా?
ఈ దర్శనం కేవలం పుట్టినరోజు సందర్భంగా మాత్రమే కాకుండా మరో కారణం కూడా ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్తో త్రిషకు ఉన్న అనుబంధం గురించి చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ విజయం సాధించాలని కోరుతూ తిరుమల వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కల నెరవేరిందంటూ..
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. “కంగ్రాట్స్.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కలలు నెరవేరాయి” అని ఆయన పేర్కొన్నారు. ఏ అంశాన్ని వదలకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ట్వీట్ చేయడం బండ్లన్నకే సెట్ అవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే, సినీ అభిమానులు కూడా “ గిల్లి జోడీ కల నెరవేరింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
@trishtrashers congratulations your dreams, come true with blessings of Lord Venkateswara .💐
— BANDLA GANESH. (@ganeshbandla) May 4, 2026
ఇదిలా ఉండగా, త్రిష-విజయ్ జంట అనేక హిట్ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. గిల్లి, తిరుపాచి, ఆతి, కురువి వంటి విజయవంతమైన సినిమాలతో ఈ జంట అభిమానులకి అత్యంత ఇష్టమైన ఆన్-స్క్రీన్ జంటగా గుర్తింపు పొందింది.
TVK పార్టీ సత్తా!
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగగా, మ్యాజిక్ ఫిగర్ 118. ఈ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 100+ స్థానాల్లో విజయ్ ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమిళవెట్రి కజగం(టీవీకే) అవతరించింది. అధికార పీఠం దిశగా అడుగులు వేస్తోంది. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
