ఆధ్యాత్మికం: మహాభారత యుద్దం చేసిన అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడా.. ఎక్కడ.. ఎలా ఉన్నాడు..!

ఆధ్యాత్మికం:  మహాభారత యుద్దం చేసిన అశ్వత్థామ ఇంకా  జీవించే ఉన్నాడా.. ఎక్కడ.. ఎలా ఉన్నాడు..!

అశ్వత్థామ ఒంటరిగా అడవుల్లో తిరుగుతున్నాడు.. ఆకలితో.. కడుపులో పేగులు నకనకలాడుతున్నాయి. పండ్లు ఏమైనా దొరుకుతాయేమో అని చెట్లన్నింటినీ చూస్తున్నాడు. ఒక్కటి కూడా దొరకలేదు. చివరికి ఓ మామిడిచెట్టు కింద రాలిన రెండు మామిడిపండ్లు కనిపించాయి. గబగబా పండ్ల దగ్గరకు వెళ్లబోయాడు. అంతలోనే ఒక పాము రెండు పండ్లను కొరుకుతుంది. దాంతో అవి విషపూరితం అయ్యాయి. అప్పుడు అశ్వత్థామకు శ్రీకృష్ణుడి శాపం గుర్తుకు వస్తుంది. అశ్వత్థామ నువ్వు తిండి దొరకక మలమలమాడిపోతావు.  నీ శరీరమంతా దుర్వాసన కలిగిన రక్తంతో తడిసిపోతుంది. 

కలియుగాంతం వరకూ దిక్కుమాలినవాడివై అలా తిరిగెదవుగాక అనే మాటలు చెవుల్లో మోగాయి. అశ్వత్థామ కళ్లలో నీళ్లు పొంగాయి. అశ్వత్థామ మహభారత మహారథుల్లో ముందువరుసలో ఉంటాడు. గురుదేవుడు.. ద్రోణాచార్యుడు ఎన్నో ఏళ్లు తపోధ్యానాలు చేస్తే శివుడు ఇచ్చిన ఏకైక వర ప్రసాదం. నుదుటిపై పుట్టుకతోనే ఉన్న జ్ఞానమణి ఆయనకు భూత, ప్రేత, పిశాచాలు, విష నాగులేకాదు పశు పక్ష్యాదులన్నింటి నుంచి తనను తాసురక్షించుకునే శక్తిని ఇస్తుంది. 

ఏకంగా ఆయన శివ స్వరూపమే! విశ్వం లో చిరంజీవులై చిరకాలం ఏకాంతంగా మిగిలిపోయిన హనుమంతుడిలాగే అశ్వత్థామ కూడా చిరంజీవి. ఇంత మంచివాడైనప్పటికీ.. ద్రౌపది కొడుకులైన ఉపపాండవులను చంపేస్తాడు. పడుకొని ఉన్న పసిపిల్లలను కుట్రతో చంపడం. ఉత్తరపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వల్ల శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఆ శాపం పెడతాడు. 

విరాగిగా మారి..

నిద్రపోతున్న పసిపిల్లల్ని చంపినందుకు ద్రౌపది కోరిక ప్రకారం అతని తలవెంట్రుకలు తొలగించి, తలపై ప్రకాశిస్తున్న జ్ఞానమణిని కోసి తీసుకుంటాడు. అర్జునుడు. దాంతో ఆయన వెలుగు, విజ్ఞానం, తేజం నశించి విరాగిగా మారిపోతాడు. కలియుగాంతం వరకు దారి తెన్నూ తెలియని విరాగిగా ఉంటూ. అడవులూ, పర్వత ప్రాంతాల్లో బాటసారులకు దారి చూపుతూ బతకమని కృష్ణుడు శాపం ఇస్తాడు

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత... అశ్వత్థామ పారిపోయి 'చేవదన' అనే ఓ ప్రదేశంలో ఉంటున్నాడని భారతంలో ఉంది. అయితే ఆ ప్రాంతం ఇప్పుడు గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది. అక్కడ అశ్వత్థామ ఇప్పటికీ దెయ్యం రూపంలో తిరుగుతుంటాడని అంటుంటారు.

బ్రహ్మాస్త్ర ప్రయోగం

కురుక్షేత్రంలో చివరికి అర్జునుడు.. అశ్వత్థామ ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకుంటారు. ఆ రెండూ కలిస్తే ప్రళయం వస్తుందని రుషులు మందలించంతో.. అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుని సాయంతో వెనక్కి తీసుకుంటాడు.. కానీ, అశ్వత్థామ ఆ పని చేయలేకపోతాడు. వెనక్కి తీసుకోవాలంటే దైవానుగ్రహబలం ఉంటేనే సాధ్యం. అది అర్జునునికి పుష్కలంగా ఉంది. దీంతో ఆ బ్రహ్మాస్త్రానికి కచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది.

 అప్పుడు అశ్వత్థామ పాండవ వంశం లేకుండా చేస్తానని సుయోధనుడికి ఇచ్చిన మాటను నిజం చేయాలని బ్రహ్మాస్త్ర గమన దిశను పాండవ స్త్రీల గర్భాల మీదకు పంపుతాడు. వాళ్లలో అర్జునుడి కోడలు, అభిమన్యుని భార్య ఉత్తర కూడా ఉంటుంది. ఉత్తర గర్భవతి. బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలోని శిశువు చనిపోతుంది. కానీ, కృష్ణుడు తన చేతి స్పర్శతో ఆ శిశువును బతికిస్తాడు. అలా కృష్ణుడి చేతి పరీక్షతో బతికిన శిశువు కాబట్టి పరీక్షిత్తు అని పిలుస్తారు.

శివరూపమైనా..

ఏ విధంగా చూసినా... అశ్వత్థామ జ్ఞానసంపన్నుడే.. ఆయనకున్న వరాలు.. తనని మరింత గొప్పగా తీర్చిదిద్దేవే! కానీ, ఆయన కోపం, అహంకారం, కౌరవులతో స్నేహం.. ఇవన్నీ ఒకవైపు చేరడంతో ఏ వరమూ ఆయనను కాపాడలేకపోయింది. అవి యుగయుగాల బాధను మిగిల్చాయి. స్వయంగా తాను శివ స్వరూపమైనా... పసి పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపిన నేరం, ద్రౌపది గర్భశోకంతో తగిలిన ఉసురు, ఆమె క్షమించిన తర్వాత కూడా అనవసరంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన పాపం, మహా పండితుని పుత్రుడై ఉండి కూడా అధర్మంవైపు నిలబడటం వల్ల... కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు మహారథిగా నియమించిన అశ్వత్థామ అంతమయ్యాడు. అశ్వత్థామకు చావులేదు. కలియుగం అంతమైనప్పుడే చనిపోతాడు. అంతవరకు ఆయన చిరంజీవే!. కానీ, ఇలా ఎంత కాలం బతికితే మాత్రం ఈ చిరంజీవికి ఏం లాభం?

ఏ విధంగా చూసినా.. అశ్వత్థామ జ్ఞానసంపన్నుడే. మహారథుడే! ఆయనకున్న వరాలన్నీ.. తనను మరింత గొప్పగా తీర్చిదిద్దేవే. స్వయంగా శివస్వరూపుడే అయినా.. తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు అశ్వత్థామ. కోపం, అహంకారం, కౌరవులతో స్నేహం చేయడం లాంటివి ఒకవైపు చేరడంతో... వరాలూ, విద్యలూ తనను కాపాడలేకపోయాయి.

వెలుగు,లైఫ్​