Sankranti Special 2026: కనుమ రోజు.. ముక్కల పండుగ.. పశువులకు పూజ.. మినప గారెలు తిన్సాల్సిందే..!

Sankranti Special 2026:  కనుమ రోజు.. ముక్కల పండుగ.. పశువులకు పూజ.. మినప గారెలు తిన్సాల్సిందే..!

సక్రాంతి పండుగ ( 2026 ) లో చివరి అంకానికి చేరుకుంది.  మూడు రోజులు అత్యంత వైభవంగా జరుపుకొనే సంక్రాంతి సంబరాలు మూడోరోజుకు ( జనవరి 16) చేరుకున్నారు.  సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి.. రెండవ రోజు సంక్రాంతి.. మూడవరోజు కనుమ..  ఈమూడు రోజులు ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా చేసుకుంటారు.  మొదటి రెండు రోజులు స్వీట్లు.. పూజలతో సంబరాలు చేసుకోగా.. మూడో రోజు కనుమ రోజు పశువులను పూజించి .. మాంసాహారం తింటారు.   అందుకే కనమ పండుగను ముక్కల పండుగ అంటారు.

కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ ఇది. పంట చేతికి రావడానికి రైతులు కష్టానికి వెల కట్టలేం.   పశువుల సాయంతో ఏడాదంతా పడే శ్రమ అంతా ఇంతా కాదు.  తమ యజమాని ఆనందంగా.. సంతోషంగా ఉండాలని పశువులు ఎంతగానో శ్రమిస్తాయి.వ్యవసాయంలోనే కాకుండా పాడి ద్వారా కూడా గోమాతలు రైతన్నను ఆర్థికంగా ఆదుకుంటాయి.  అందుకే కనుమ పండుగరోజు పశువులను దైవంగా భావించి పూజించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కనుమ రోజును పశువుల పండుగ అంటారు.

రైతన్నకు  ప్రకృతితో విడదీయలేని అనుబంధం ఉంటుంది. మట్టి -నీళ్లూ,చెట్టు చేమ అన్నీ రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి. ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా.. పశువులతో, పక్షులతో పంచుకుంటారు. పిట్టల కోసం దాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు  ఆవులు, ఎద్దులకు పూజచేస్తారు. అన్నం పెట్టి పొలానికి నైవేద్యం పెడతారు.

అవి కూడా ఫ్యామిలీలో భాగం...

నాగలి కడితే పొలం దున్నుతాయి. బండి కడితే ఎరువు, ధాన్యం మోసుకెళతాయి. గుంటుక కడితే.. భూమిని  చదును చేస్తాయి. ఇలా రైతన్న ఏ పని చెప్తే ఆ పని చేస్తాయి పశువులు. ఇప్పుడంటే ట్రాక్టర్లు.. అత్యాధునిక టెక్నాలజీతో యంత్రాలు వచ్చాయనుకోండి.  పూర్వం ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొట్టం లేని రైతు ఉండేవాడు కాదంటే ...  రైతులు పశువులకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో   దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. 

Also Read : మౌని అమావాస్య ( జనవరి 18) న పుణ్య స్నానం

పంట సమృద్దిగా పండినప్పుడు రైతుకు కలిగే సంతోషానికి  కష్టపడేది  పశువులే..  అలాంటి మూగ జీవాలను  తమ ఫ్యామిలీలో మెంబర్లాగే చూసుకునేంత ప్రేమ  రైతులకు ఉంటుంది. నాలుగు మోపుల గడ్డేసినందుకే వ్యవసాయంలో తన కష్టాన్ని పంచుకొని, ఆకలి తీరుస్తున్న ఈ పశువులకు కృతఙ్ఞతలు చెబుతూ ... వాటిని పూజలు చేసి.. అలంకారం చేయడమే.. కనుమ పండుగ ముఖ్య ఉద్దేశమని పండితులు చెబుతున్నారు. 

పశువులకు  పూజ ఎలా చేయాలి

కనుమ రోజు.. రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎలాంటి పని చేయించరు. ఉదయమే పశువులను నదీ తీరాలు లేదా చెరుపుల దగ్గరికి తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. నుదుట పసుపు, కుంకుమలతో. బొట్టు పెట్టి.. వాటి మెడలో గలుగలమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు  ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు. ఆ పొంగలిని కొంత  తమ పొలాల్లో చల్లుకుంటారు. అలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు.

మాంసం వండాల్సిందే..

భోగి, సంక్రాంతి రెండు రోజులు తీపి పండుగలైతే కనుమ ముక్కల పండుగ అని అంటారు. సంక్రాంతి పండుగలో.. మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటారు. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు అందులోకి నాటుకోడి మాంసం ఉండాలంటారు. కేవలం కోడికూరతో ఆగిపోకుండా.. ముగ్గురు నలుగురు కలిసి మేకను కోసుకొని తినడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే కనుమనాడు చికెన్, మటన్ షాపుల ముందు జనాలు బారులు తీరుతారు .

మినప గారెలు

కనుమనాడు 'మినుములు' తినాలనే ఆచారం ఉంది. అందుకే 'మినప గారెలు చేసుకొని తింటారు. కనుమ రోజు కాకి కూడా కదలదని సామెత ఇందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్లు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. అలాగే ముత్తైదువులకు కనుమనాడు పసుపుబొట్టు ఇవ్వడం సంప్రదాయం.

 కనుమ పండుగ సందడికి కారణం ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చే పశుసంపదే.  అందుకే పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేస్తారు. పంట పండించేందుకు, వాటిని ఇంటికి తీసుకొచ్చేందుకు సహకరించే పశువులను కనుమ రోజు అందంగా అలంకరించి పూజిస్తారు.. ఆహారం అందిస్తారు. ఈ రోజు ( 2026 జనవరి 16)  వాటితో ఏ పనీ చేయించరు. కనుమ రోజు మాంసాహారం తింటారు..మాంసాహారం తిననివారికి పోషకాలు అందించేందుకు మినుము తినమంటారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.