- హైవే 63 పక్కన ఇండ్ల స్థలాలు ఇయ్యాలని డిమాండ్
ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి - 2003లోనే 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
- ప్రకృతి వనం, క్రీడా మైదానం ఏర్పాటుకు యత్నం
మంచిర్యాల, వెలుగు: గోదావరి వరదలు, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ మునిగిపోయింది. ఈ నెల 13 నుంచి 16 వరకు ఇండ్లు పూర్తిగా నీట మునగడంతో గ్రామస్తులు కట్టుబట్టలతో వెళ్లి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వరద తగ్గడంతో గ్రామానికి తిరిగి వచ్చినా ఇండ్లలో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఏటా ముంపు ముప్పు పొంచి ఉండడంతో తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నా వారి గోడు ఎవరూ వినడం లేదు. దీంతో 200 మందికిపైగా ముంపు బాధితులు సోమవారం మూకుమ్మడిగా తరలివచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. నేషనల్ హైవే పక్కన గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఇండ్ల స్థలాలు ఇయ్యాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్ భారతి హోళికేరిని కలిస్తే తనకు టైమ్ లేదంటూ వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్‌కు మెమోరాండం అందజేశారు.
2003లోనే కేటాయించిన ప్రభుత్వం...
గతంలో పలుమార్లు గోదావరికి వరదలు వచ్చి దేవులవాడ గ్రామం ముంపునకు గురైంది. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత బబ్బెరచెల్క పంచాయతీ పరిధిలోని 27, 28, 31, 549, 559 సర్వేనంబర్లలోని 15 ఎకరాలను ఇండ్ల స్థలాల కోసం కేటాయించారు. 259 ఎస్సీ, 56 బీసీ, 8 ఓసీ, మొత్తం 323 కుటుంబాలకు ప్లాట్లు కేటాయిస్తూ 2003 జూలై 10న అప్పటి మంచిర్యాల ఆర్డీవో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. సదరు కుటుంబాలకు లాట్ సిస్టమ్‌లో ప్లాట్లు కేటాయించి పట్టాలు అందజేయాలని కోటపల్లి ఎమ్మార్వోను ఆదేశించారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదు. రోడ్లు, తాగునీరు, కరెంట్ వంటి సౌలత్లు కల్పించలేదు. దీంతో అక్కడ ఇండ్లు కట్టుకునేందుకు గ్రామస్తులు ఇంట్రెస్ట్ చూపలేదు. అప్పటినుంచి ఆ భూమి ఖాళీగానే ఉంది. ప్రకృతివనం, క్రీడామైదానం ఏర్పాటు... బబ్బెరచెల్క, దేవులవాడ గ్రామాల్లో ప్రభుత్వపరంగా చేపట్టే అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఇదే భూమిపై కన్నేశారు. ఇప్పటికే శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు నిర్మించారు. ఇటీవల రెండు బృహత్ ప్రకృతి వనాలు, క్రీడా మైదానం ఏర్పాటు కోసం మిగిలిన 12 ఎకరాలను కేటాయించి చదును చేశారు. అక్కడ 2003లోనే ప్రభుత్వం తమకు ఇండ్ల స్థలాలు కేటాయించిందని, పట్టాలు ఇయ్యాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. అక్కడే తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ముంపు బాధితులు కోరుతున్నారు.
ఇండ్ల స్థలాలు ఇయ్యాలె...
గోదావరికి వరదలొచ్చి మా గ్రామం పూర్తిగా మునిగిపోయింది. గొడ్డూ గోదా అన్నీ వదిలేసి పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నం. అక్కడ నాలుగు అయిదు రోజులు చాలా అవస్థలు పడ్డం. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉన్నది. గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో మాకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలె. – ఆసరెల్లి సౌమ్య, దేవులవాడ
ఇండ్లళ్ల ఉండే పరిస్థితి లేదు...
గతంలో వరదలు వచ్చి మా ఊరు మునిగింది. అప్పటి అధికారులు హైవే పక్కన భూమి కొని ఇండ్ల స్థలాలు ఇచ్చిన్రు. కానీ రోడ్లు, నీళ్లు, కరెంట్ సౌలత్లు లేకపోవడంతో ఇండ్లు కట్టుకోలేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఏటా వరదలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇండ్లలో ఉండే పరిస్థితి లేదు. శాశ్వత పరిష్కారం చూపాలె. –ఆసరెల్లి తిరుపతి, దేవులవాడ
స్థలాలు ఇచ్చేదాక కొట్లాడుతం
ముంపు ముప్పును గుర్తించిన అధికారులు ఇరవై ఏండ్ల కిందనే హైవే పక్కన ఇండ్ల కోసం 15 ఎకరాలు కేటాయించిన్రు. ప్రస్తుతం అక్కడ పార్కులు, క్రీడా మైదానం పెట్టేందుకు అధికారులు ట్రెంచ్‌లు కొట్టిన్రు. ప్రజల ప్రాణాల కన్నా పార్కులే ముఖ్యమా? మా గోస ఎవరికీ పట్టదా? ఇండ్ల స్థలాలు ఇచ్చే దాకా కొట్లాడుతం. – నిమ్మటి సతీష్, దేవులవాడ
