AUS vs SA: ఆస్ట్రేలియాపై శివాలెత్తిన బ్రెవిస్.. 41 బంతుల్లోనే CSK కుర్రాడు సెంచరీ

AUS vs SA: ఆస్ట్రేలియాపై శివాలెత్తిన బ్రెవిస్.. 41 బంతుల్లోనే CSK కుర్రాడు సెంచరీ

సౌతాఫ్రికా 22 ఏళ్ళ కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్ ఆస్ట్రేలియాపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.  నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కంగారులను చుక్కలు చూపించాడు. మంగళవారం (ఆగస్టు 12) డార్విన్ వేదికగా మర్రారా క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ సఫారీ కుర్రాడు కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఓవరాల్ గా 56 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. బ్రెవిస్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లతో పాటు 8 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు టీ20ల్లో బ్రెవిస్ కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 

సౌతాఫ్రికా కెప్టెన్ మార్కరం ఔటైన తర్వాత క్రీజ్ లోకి అడుగుపెట్టిన బ్రెవిస్.. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. తొలి ఆరు బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నుంచి అసలైన విధ్వంసం మొదలయింది. మ్యాక్స్ వెల్ వేసిన 12 ఓవర్లో మూడు సిక్సర్లు.. ఒక ఫోర్ తో 24 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత తన జోరును మరింత పెంచాడు. 50 ఉంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి కేవలం 16 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. 

డ్వార్షుయిస్ వేసిన 15 ఓవర్ ఐదో బంతికి ఫైన్ లెగ్ లో బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరపున టీ20 క్రికెట్ లో  ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. తొలి స్థానంలో 35 బంతుల్లో సెంచరీ చేసిన మిల్లర్ ఉన్నాడు. బ్రెవిస్ మెరుపు సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. స్టబ్స్ 31 పరుగులు చేసి రాణించాడు. ఈ సిరీస్ లో భాగంగా తొలి టీ20లో సౌతాఫ్రికా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 

►ALSO READ | Cristiano Ronaldo: ఓ మై గాడ్ అనాల్సిందే: రొనాల్డోకు ఎంగేజ్ మెంట్..