
DGCA Alert: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం దేశంలోని కీలకమైన వైమానిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, మిలిటరీ స్థావరాల రక్షణపై ప్రత్యేక దృష్టిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబర్ల ముసుగులో కొందరు సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ అధికారులకు చేరవేస్తున్నట్లు తేలిన సంగతి తెలిసిందే. పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇటీవల ఇంటెలిజెన్స్ అధికారులు వరుసగా పాక్ సానిభూతిపరులతో పాటు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొందరిని పట్టుకున్న తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు విమానయాన రంగాన్ని నియంత్రించే సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఖచ్చితంగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ప్రకటించాయి. ఈ క్రమంలో విమాన ప్రయాణికులు సైనిక వైమానిక స్థావరాల నుంచి ప్రయాణించే సమయంలో సంబంధించిన విమానాల ఫోటోలు లేదా వీడియోలు తీయవద్దని సూచించింది. కొత్త మార్గదర్శకాలు భారతదేశంలోని సైనిక వైమానిక స్థావరాల నుండి బయలుదేరే లేదా దిగే విమానాలకు వర్తిస్తాయని డీజీసీఏ ప్రకటించింది.
దీంతో అమృత్‌సర్, జమ్మూ, శ్రీనగర్, జైసల్మేర్ విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు చేసే వారు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయాల్లో కిటికీల నుంచి ఫొటోలు వీడియోలు తీయటం పూర్తిగా నిషేధించబడింది. విమానం 10,000 అడుగుల ఎత్తుకు చేరుకునే వరకు లేదా నేలపై పూర్తిగా ఆగిపోయే వరకు ఈ నియమాన్ని పాటించాలని DGCA వెల్లడించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో విమాన ప్రయాణాలకు సంబంధించి వీడియోలు, ఫొటోలను సహజంగా షేర్ చేస్తుంటారు కాబట్టి పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిని పాటించని వ్యక్తులకు జరిమానా ఉంటుందని పేర్కొంది.
తాజా నిబంధనలకు అనుగుణంగా విమానయాన సంస్థలు జాగ్రత్తలు పాటించాలని డీజీసీఏ వెల్లడించింది. ప్రయాణ సమయంలో క్యాబిన్ సిబ్బంది రూల్స్ గురించి జర్నీ చేసేవారికి తెలపాలంది. దీనికి అనుగుణంగా విమానయాన సంస్థలు తమ ప్రయాణ ప్రొటోకాల్స్ మార్పు చేసుకోవాలని సూచించింది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీలు షేడ్స్ క్రిందికి ఉండేలా చూసుకోవాలి. అలాగే గ్రౌండ్ స్టాఫ్ కి దీనిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, బోర్డింగ్ గేట్ల వద్ద ప్రజలకు ఈ విషయాన్ని తెలుపుతూ నోటీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించబడింది.