
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్టులలో టేకాఫ్ ,ల్యాండింగ్ సమయంలో విమానాల్లో ఇకపై కిటికీల షేడ్‌లను క్రిందికి ఉంచాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అయితే ఈ ఎయిర్ పోర్టులలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలోగానీ, గాల్లో ఉన్నపుడుగానీ ఫోటోలు లేదా వీడియోల నిషేధం కొనసాగుందని తెలిపింది.
గతంలో భారత వైమానిక దళం (IAF) ఉపయోగించే విమానాశ్రయాలలో (IAF Joint User Airports - JUAs) విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ప్రయాణికులు విండో షేడ్స్‌ను దించి ఉంచాలని DGCA ఆదేశాలు జారీ చేసింది. ఇది ముఖ్యంగా పశ్చిమ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులలో భద్రతా కారణాల దృష్ట్యా అమలు చేశారు.
సైనిక స్థావరాలు, విమానాలు, ఎయిర్‌ఫీల్డ్ లేఅవుట్‌ల ఫొటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన అనేక ఘటనలతో ఈ నిబంధన తీసుకొచ్చారు. ఇది రహస్య రక్షణ సమాచారాన్ని షేర్ చేసే అవకాశం ఉందని భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే IAF నుంచి సవరించిన ఆదేశాల తర్వాత విండో షేడ్స్‌ను దించాల్సిన అవసరం లేదని DGCA స్పష్టం చేసింది. ఈ సవరణతో ప్రయాణికులు తమ కిటికీ తెరలను టేకాఫ్ ,ల్యాండింగ్ సమయాల్లో పైకి లేపుకోవచ్చు.
ఫోటోగ్రఫీ నిషేధం కొనసాగింపు
విండో షేడ్స్‌పై నిబంధన సడలించినప్పటికీ IAF ఉపయోగించే ఎయిర్ పోర్టులలో గాలిలో ,నేలపై ఫోటోగ్రఫీపై నిషేధం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. అంటే ప్రయాణికులు విమానం లోపల లేదా బయట ఎయిర్‌పోర్ట్ ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం భద్రతా ప్రమాణాలను కాపాడుకుంటూనే ప్రయాణికులకు కొంత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఫోటోగ్రఫీ నిషేధం అనేది దేశ భద్రత దృష్ట్యా కీలకమైన చర్యగా కొనసాగుతుంది.