హైదరాబాద్, వెలుగు: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంతో సమర్థవంతమైన పోలీసింగ్ నిర్వహించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల ఛేదన, డేటా విశ్లేషణలో భాగంగా సీఐడీ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు షీ సైబర్ ల్యాబ్‌ను శుక్రవారం డీజీపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత స్మార్ట్ క్రైమ్ అనాలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్, స్మార్ట్ కాన్ఫరెన్స్ సదుపాయాలతో రూపొందించిన వ్యవస్థ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని అన్నారు. సీఐడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లో వినూత్న సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ‘ల్యాబ్‌లో మాట్లాడుతున్న వ్యక్తిని కెమెరా గుర్తించి అతని వైపు తిరగడంతో పాటు, ఆటోమేటిక్‌గా జూమ్ అవుతూ.. వీడియో, ఆడియో రికార్డింగ్ చేస్తుంది.
ఆయా సమావేశాల్లో చర్చించిన అంశాలను డిజిటల్ రూపంలో స్టోర్ చేయడంతో పాటు అవసరమైనప్పుడు తిరిగి విశ్లేషించే అవకాశం కల్పిస్తుంది. మానిటర్ లేదా డిజిటల్ బోర్డుపై ఇచ్చిన సమాచారాన్ని గుర్తించి టెక్స్ట్, ఆడియో లేదా నివేదిక రూపంలో మార్చగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. ఏఐ సాయంతో సమాచారాన్ని విశ్లేషించడం, క్రైమ్ మ్యాపింగ్, డేటా ఫిల్టరింగ్, నేర ధోరణుల అధ్యయనం, కేసుల సమీక్ష వంటి అంశాలను మరింత వేగవంతంగా, కచ్చితంగా నిర్వహించవచ్చు’ అని తెలిపారు.
బాధితులు, ఫిర్యాదుదారుల అభిప్రాయాలను కూడా డిజిటల్ రూపంలో నమోదు చేసి భద్రపరచడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని, దీనివల్ల కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, ప్రజల స్పందన వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయడం సులభమవుతుందన్నారు. అలాగే, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) లో ఈ ల్యాబ్‌లు భవిష్యత్తులో కీలక మైలురాయిగా నిలుస్తాయని డీజీపీ విశ్వాసం వ్యక్తం చేశారు.
