
- లొంగిపోవడం ఒక్కటే వారికి మార్గం: డీజీపీ జితేందర్
- ఈ ఏడాది 404 మంది లొంగిపోయారు.. పార్టీలో ఇంకా 78 మంది ఉన్నరని వెల్లడి
- పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాత
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని డీజీపీ జితేందర్ అన్నారు. 2004లో జరిపిన చర్చలతోనూ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. వారికి లొంగిపోవడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తమను తాము కాపాడుకోవడానికే మావోయిస్టులు చర్చల ప్రతిపాదనను తెర పైకి తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా శనివారం డీజీపీ జితేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణ నుంచి 78 మంది మాత్రమే ఉన్నారని.. 15 మందితో కూడిన కేంద్ర కమిటీలో11 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22 మంది మృతిచెందగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిపారు.
మావోయిస్టుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పాలసీని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సుజాత గత 43 ఏండ్లుగా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేశారని డీజీపీ తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా లొంగిపోయారని చెప్పారు. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులకు వారిపై ఉన్న రివార్డులు, పునరావాసం, వైద్యం లాంటి సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సుజాతకు రూ.25 లక్షల రివార్డు చెక్కును డీజీపీ అందించారు.
43 ఏండ్లు అజ్ఞాతంలో సుజాత
గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్పాడు గ్రామానికి చెందిన పోతుల పద్మావతి అలియాస్ సుజాత(62)..1982 డిసెంబర్‌లో జననాట్యమండలిలో చేరారు. ఆ తరువాత 42 ఏండ్లు అజ్ఞాత జీవితంలో మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేసి.. కేంద్ర కమిటీ సభ్యురాలి స్థాయికి చేరుకున్నారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావును 1984లో పెండ్లి చేసుకున్నారు. 1988-–-89 వరకు పెరిమిలి దళం,ఎటపల్లి దళంలో వీరిద్దరూ పనిచేశారు.
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలి
2026 మార్చి 31 వరకు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్రం లక్ష్యమని.. ఈ మేరకు లొంగిపోవడం ఒక్కటే మావోయిస్టులకు ఉత్తమ మార్గమని డీజీపీ తెలిపారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్‌కార్యదర్శి, ఎనిమిది మంది డివిజన్‌కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 404 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు వెల్లడించారు. అనంతరం ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని అంశమన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తోందని వెల్లడించారు. కేసుల విషయంలోనూ ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ చర్చించిన సానుభూతితో వ్యవహరించేలా చూస్తామన్నారు.