వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‏కు పాక్‌‎తో లింకులు.. లడఖ్‎లో అల్లర్లకు అతడే కారణం: డీజీపీ ఎస్‌‎డీ సింగ్ జమ్వాల్

వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‏కు పాక్‌‎తో లింకులు.. లడఖ్‎లో అల్లర్లకు అతడే కారణం: డీజీపీ ఎస్‌‎డీ సింగ్ జమ్వాల్

లేహ్: లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‎కు పాకిస్తాన్‌‎తో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని లడఖ్ డీజీపీ ఎస్‌‌‌‌‌‌‌‌డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేసిన అతణ్ని.. రాజస్తాన్‌‎లోని జోధ్‌‎పూర్‌‌‌‌‌‌‌‌‌‌జైలుకు తరలించినట్టు చెప్పారు. ఈ కేసు వివరాలను డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు. ఓ పాకిస్తాన్ గూఢచారిని గత నెలలో అరెస్టు చేశామని, అతనితో వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‎కు సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. 

‘‘లడఖ్‌‎లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడు వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్. అతనికి సొంత అజెండా ఉంది. అరబ్ స్ప్రింగ్ ఉద్యమంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక నిరసనలను తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. అలా యువతను రెచ్చగొట్టారు. వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల వీడియోలను పాకిస్తాన్ గూఢచారి ఆ దేశానికి పంపించాడు. 

అలాగే వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌ విదేశీ పర్యటనలపైనా అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్‌‎లో ‘ది డాన్’ మీడియా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బంగ్లాదేశ్‌‎లోనూ పర్యటించారు. వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‎కు చెందిన స్వచ్ఛంద సంస్థలకు అందిన విదేశీ నిధులపైనా దర్యాప్తు జరుగుతోంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ)ను ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఉన్నాయి” అని వెల్లడించారు.

చర్చలను అడ్డుకునే ప్రయత్నం.. 

లడఖ్ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలను అడ్డుకునేందుకు వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ప్రయత్నించారని డీజీపీ తెలిపారు. అల్లర్ల వెనుక విదేశీ కుట్ర ఉందన్న ఎల్జీ కవీందర్ గుప్తా వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఘర్షణల తర్వాత ముగ్గురు నేపాలీ పౌరులు బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరారు.

ఇందులో ఇంకొంత మంది హస్తం కూడా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి మొత్తం 50 మందిని అరెస్టు చేశాం” అని తెలిపారు. కాగా, లేహ్‌‌‌‌‌‌‌‌లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించామని డీజీపీ తెలిపారు. ప్రజలను 2 గంటల పాటు బయటకు అనుమతిస్తున్నామని చెప్పారు. సిటీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.