లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటం: డీజీపీ శివధర్ రెడ్డి

లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటం: డీజీపీ శివధర్ రెడ్డి
  •   మిగిలినోళ్లూ అజ్ఞాతం వీడాలి: డీజీపీ శివధర్ రెడ్డి
  •     తెలంగాణ నేతలు ఇంకా 64 మంది అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి 
  •     లొంగిపోయిన మావోయిస్టులు పుల్లూరి ప్రసాద్‌‌‌‌రావు, బండి ప్రకాశ్ 
  •     45 ఏండ్ల అజ్ఞాతం వీడిన సీనియర్ నేతలు 
  •     సిద్ధాంతాన్ని వీడను.. జనంలో ఉండి పోరాడుతా: ప్రసాద్‌‌‌‌రావు 


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లొంగిపోతున్న మావోయిస్టులను కాపాడుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. వాళ్లను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని చెప్పారు. మావోయిస్టులు ఎవరికి వారు ఇష్టంతో బయటకు వస్తున్నారని, అలాంటి వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటామని ఆ పార్టీ బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. దీన్ని బట్టి సిద్ధాంతపరంగా మావోయిస్టు పార్టీ ఎంత పడిపోయిందో తెలుస్తున్నదన్నారు. 45 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌‌‌‌ ‌‌‌‌పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్‌‌‌‌ చంద్రన్న/శంకరన్న/సోమన్నతో పాటు స్టేట్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌సీఎం) బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్‌‌‌‌/బండి దాదా/క్రాంతి మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటు కోసం సమగ్ర వ్యూహం అవలంబిస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, రక్షణ కల్పిస్తున్నాం. ఈ క్రమంలోనే ఇటీవల కీలక నేతలు అజ్ఞాతం వీడారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు.. పుల్లూరి ప్రసాద్ రావు, బండి ప్రకాశ్ లొంగిపోయారు. వీరిద్దరూ అనారోగ్యం, పార్టీతో సైద్ధాంతిక విభేదాలు, నాయకత్వంలోని అంతర్గత చీలికలతో అజ్ఞాతం వీడారు. ప్రభుత్వ సహకారంతో జనజీవన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం, ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గత 15, 20 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ జరగడం లేదు. అనారోగ్యం, పార్టీ అంతర్గత విభేదాలతో మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు” అని చెప్పారు. 

మావోయిస్టు భావజాలాన్నిఎవరూ ఓడించలేరు: ప్రసాద్ రావు

మావోయిస్టు భావజాలాన్ని ఓడించడం ఎవరితరం కాదని లొంగిపోయిన మావోయిస్టు పుల్లూరి ప్రసాద్‌‌‌‌ రావు అన్నారు. ‘‘మావోయిస్టు సిద్ధాంతం ఓడిపోలేదు.. ప్రజల మధ్యనే ఉన్నది. మాది లొంగుబాటు కాదు.. అనారోగ్యం, కగార్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్లు సహా ఇప్పుడున్న పరిస్థితిల్లో నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి  మేమిద్దరం బయటకు వచ్చాం. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చాం. ఇకపై ప్రజాస్వామిక పద్ధతిలో పని చేయాలనుకుంటున్నాం. ప్రధాన కార్యదర్శిగా దేవ్‌‌‌‌జీ అలియాస్‌‌‌‌ తిప్పరి తిరుపతిని మావోయిస్టు పార్టీ ఎన్నుకున్నది. కానీ పార్టీలో చీలిక వచ్చి ఎవరి మార్గం వారు ఎంచుకున్నారు. నేను పార్టీ లైన్‌‌‌‌నే సమర్థిస్తున్న. దేవ్‌‌‌‌జీకి సపోర్ట్‌‌‌‌ చేస్తున్న.. సోనును వ్యతిరేకిస్తున్న’’ అని చెప్పారు. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా పని చేయాలని పార్టీ ఆలోచిస్తున్నదని, పార్టీలో అంతర్గతంగా చీలిక వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. తమకు ప్రజల మధ్య పనిచేసే క్యాడర్ కూడా ఉన్నదని, తమ ఐడియాలజీతో శక్తిమేర పని చేస్తామని పేర్కొన్నారు. 

ఈ ఏడాది427 మంది లొంగుబాటు.. 

ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు సెంట్రల్ కమిటీ సభ్యులు, 8 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇద్దరు డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 35 మంది ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. వాళ్లంతా ఆయుధాలు వీడి కుటుంబాలతో శాంతియుత జీవితం కొనసాగిస్తున్నారని చెప్పారు. ‘‘ప్రస్తుతం అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన64 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు. వారిలో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్స్‌‌‌‌గా పని చేస్తున్నారు. వాళ్లంతా కూడా హింసను వీడి, జనజీవన స్రవంతిలోకి రావాలి. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలి. పోరు వద్దు..- ఊరు ముద్దు.. ఆయుధాలు వీడి  ప్రజా జీవితంలో చేరండి. మీ గ్రామానికి తిరిగి రండి” అని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌ఐబీ ఐజీ సుమతి, లా అండ్ ఆర్డర్‌‌‌‌ ‌‌‌‌డీజీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ పాల్గొన్నారు. 

కిషన్‌‌‌‌జీకి కొరియర్‌‌‌‌‌‌‌‌గా చంద్రన్న ప్రస్థానం ప్రారంభం

పుల్లూరి ప్రసాద్‌‌‌‌రావు అలియాస్‌‌‌‌ చంద్రన్న సొంతూరు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామం. 1979లో ఇంటర్ చదివే రోజుల్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌యూ) ఆర్గనైజర్‌‌‌‌ దగ్గు రాజలింగంతో ఏర్పడిన పరిచయంతో ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 1980లో ఇంటర్‌‌‌‌ పూర్తి చేసిన తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌‌‌‌ కిషన్‌‌‌‌జీకి కొరియర్‌‌‌‌గా పని చేశారు. ఆ క్రమంలో 1980లో పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత 1981లో పీపుల్స్‌‌‌‌వార్‌‌‌‌‌‌‌‌లో ఆసిఫాబాద్‌‌‌‌ దళ సభ్యుడిగా చేరి.. 1983లో సిర్పూర్‌‌‌‌ దళం ఇన్‌‌‌‌చార్జుగా నియమితులయ్యారు. 1992లో ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కమిటీ కార్యదర్శిగా, 1995లో నార్త్‌‌‌‌ తెలంగాణ స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్‌‌‌‌ తెలంగాణ స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీ కార్యదర్శిగా, 2008లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2015 వరకు నార్త్‌‌‌‌ తెలంగాణ స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీ కార్యదర్శిగా పని చేశా రు. 2021లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ రాష్ట్ర కమిటీకి మార్గదర్శనం చేస్తున్నారు. 

ప్రభాత్‌‌‌‌ ప్రకటనల ప్రకాశ్‌‌‌‌..  

బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్‌‌‌‌ సొంతూరు మంచిర్యాల జిల్లా మందమర్రి. 1983లో కార్మెల్‌‌‌‌ కాన్వెంట్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో ఏడో తరగతి వరకు చదివారు. రాడికల్‌‌‌‌ యూత్‌‌‌‌ లీగ్‌‌‌లో 1984లో చేరి.. పుల్లూరి ప్రసాదరావు నాయకత్వంలో సిర్పూర్‌‌‌‌ దళంలో పని చేశారు. 1984లో సీపీఐ నాయకుడు వీటీ అబ్రహం హత్య కేసులో జైలుకు వెళ్లగా.. 1988లో ఆదిలాబాద్‌‌‌‌ సబ్‌‌‌‌ జైలు నుంచి పారిపోయి, 1989లో అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌కి వెళ్లారు.  సిద్ధాంతపరమైన విభేదాలు రావడంతో దళాన్ని వదిలి మల్కాజ్‌‌‌‌గిరిలో మేస్త్రీగా పని చేశారు. అయితే, వీటీ అబ్రహం హత్య కేసులో 1992లో మరోసారి అరెస్టు కాగా, జీవిత ఖైదు పడి చంచల్‌‌‌‌గూడ జైలుకు వెళ్లారు. 2004లో మెర్సీ గ్రౌండ్స్‌‌‌‌ మీద జైలు నుంచి విడుదల య్యారు. 2004లో శాంతి చర్చల సమయంలో నార్త్‌‌‌‌ తెలంగాణ స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీలో మావోయిస్టు పార్టీ నియమించింది. 2005లో శాంతి చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2008 నుంచి 2011 వరకు చర్ల- శబరి ఏరియా కమిటీ ఇన్‌‌‌‌చార్జుగా, 2012లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది..  ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2015లో ఆరోగ్యం క్షీణించడంతో సింగరేణి కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌ కమిటీ ఇన్‌‌‌‌చార్జిగా, ప్రజావిముక్తి పత్రిక సంపాదకుడిగా నియమితులయ్యారు. 2015నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌‌‌‌సీ) ప్రెస్‌‌‌‌ టీమ్ ఇన్‌‌‌‌చార్జీగా కొనసాగుతూ మావోయిస్టు పార్టీ పత్రికా ప్రకటనలను ‘ప్రభాత్‌‌‌‌’ పేరుతో విడుదల చేస్తున్నారు.