
- ఆలయ భూముల రక్షణకు డీజీపీఎస్ సర్వే!..రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్
- ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా చేసే ప్లాన్
- ఆన్ లైన్లో భూ వివరాలు, ఫీల్డ్‌లో నక్ష హద్దుల ఏర్పాటుతో సంరక్షించే చర్యలు
- తెలంగాణలో ధూప, దీప నైవేద్యం కింద 87,235 ఎకరాలు
- అక్రమార్కుల చెరలో 20,124.03 ఎకరాల భూమి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆలయ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఆలయ భూములకు డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సర్వే చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా భూములను డిజిటలీకరించి, నక్షా హద్దులను నిర్ధారించనున్నది. ఆలయ భూముల డిజిటలీకరణతో ఆక్రమణలను గుర్తించడంతోపాటు చట్టపరమైన రక్షణ కల్పించనున్నది. డీజీపీఎస్ సాంకేతికతతోపాటు జీపీఎస్, ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్), క్యాడ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి భూ సర్వేలు నిర్వహించనున్నారు. దీనిద్వారా కచ్చితమైన మ్యాప్‌లను రూపొందించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే ఆలయ భూముల వివరాలు, నక్షా హద్దులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వే విజయవంతమైతే తెలంగాణలో ఆలయ భూముల రక్షణ, డిజిటలీకరణ, చట్టపరమైన హక్కుల నిర్ధారణలో ఒక మైలురాయిగా నిలువనున్నది.
ఆక్రమణల్లో పాలమూరు ఫస్ట్
డీజీపీఎస్ సర్వేకు ప్రభుత్వం మొదట 3 జిల్లాలను ఎంపిక చేసింది. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్-సికింద్రాబాద్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టనున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ఆలయ భూములు ఆక్రమణకు గురికాగా.. సర్వే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 20,124.03 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా.. వితౌట్ లిటిగేషన్ తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఆ జిల్లాలో 5,522.22 ఎకరాలు ఉండగా.. అందులో 3,018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు తెలిపారు. రెండోస్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4,125.03 ఎకరాలు ఉండగా.. 2,888.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. మూడోస్థానంలో హైదరాబాద్ జిల్లా ఉంది. ఇక్కడ 5,718.01 ఎకరాలు ఉండగా.. 2,374.25 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సికింద్రాబాద్ లో 279.25 ఎకరాలు ఉండగా 7.12 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 9,360.01 ఎకరాలు ఉండగా 1,148.15 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2,294.26 ఎకరాలు ఉండగా.. 444.16 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 5,429.03 ఎకరాలు ఉండగా.. 688.34 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6,963.32 ఎకరాలు ఉండగా.. 1,374.35 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2,377.09 ఎకరాలు ఉండగా.. 645.38 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అయితే, ఆయా జిల్లాల్లో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో భూములకు రక్షణ చర్యలు చేపట్టేకపోతే దేవాలయాల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావించిన ప్రభుత్వం డీజీపీఎస్ సర్వేకు శ్రీకారం చుట్టింది.
ఆలయ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేలా..
గతంలో ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కోసం ప్రభుత్వ భూములను కేటాయించారు. రాష్ట్రంలో ఆలయాలకు 87,235.39 ఎకరాలను కేటాయించినట్లు రికార్డులు ఉన్నాయి. ఆ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆలయాల పరిరక్షణ, భూముల సంరక్షణ బాధ్యతలు దేవాదాయశాఖ పర్యవేక్షిస్తున్నది. అయితే, భూముల పరిరక్షణ బాధ్యతలు ఏసీలు (అసిస్టెంట్ కమిషనర్లు), ఈఓలకు అప్పగించింది. ఇప్పుడు వీరి కొరత ఉండటంతో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు మండలాలకు బాధ్యతలు అప్పగించింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20,124.03 ఎకరాల భూమి అక్రమార్కుల చెరలో ఉంది. భూములకు అధిక ధరలు పలుకుతుండటంతో ఆక్రమణల పర్వానికి ఫుల్స్టాప్ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వే చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించింది. భూముల విషయంపై ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీలతో చర్చించారు. త్వరలో ప్రభుత్వం ఎండోమెంట్ అధికారులతో మరో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.