రోజురోజుకూ టాటా ట్రస్ట్ లోపల పరిణామాలు వేడెక్కిపోతున్నాయి. ఇప్పటికే బోర్డు రెండు ముక్కలు కావటంతో మెహ్లీ మిస్త్రీని ఓటింగ్ ద్వారా బయటకు పంపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో ముంబై చారిటీ కమిషనర్ కార్యాలయంలో వ్యాపారవేత్త మెహ్లీ మిస్త్రీ కేవియట్ దాఖలు చేయడం ద్వారా టాటా ట్రస్ట్‌ల పరిపాలన కొత్త మలుపు తిరిగింది. గత వారం ఆయనను ట్రస్టీగా మళ్లీ నియమించాలన్న ప్రతిపాదన తిరస్కరించబడిన నేపథ్యంలో భవిష్యత్తులో ట్రస్ట్ బోర్డులో మార్పులపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందుగా తన వాదన వినిపించుకునే హక్కు కోసం మిస్త్రీ ఈ చర్య తీసుకున్నారు.
2022 అక్టోబర్‌లో టాటా ట్రస్ట్‌ల బోర్డులో చోటుదక్కిన మిస్త్రీ.. రతన్ టాటా వీలునామా నిర్వాహకుడిగా కూడా ఉన్నారు. ఆయన సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, ఇంకా బాయ్ హీరాబాయి జమ్షెజీ నవసారి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ట్రస్టీలందరికీ నోటీసులు పంపించారు. ఈ రెండు ప్రధాన ట్రస్టులు టాటా సన్స్‌లో మెజారిటీ వాటా కలిగి ఉన్నందున, ఈ వివాదానికి వ్యాపారపరమైన ప్రాధాన్యం పెరిగింది. ట్రస్టీగా మిస్త్రీ పునర్నియామానికి ఏకగ్రీవం అవసరం ఉన్నప్పటికీ.. అక్టోబర్ 23న జారీ చేసిన సర్క్యులర్‌లో చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్‌లు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు మిస్త్రీ కొనసాగింపునకు వ్యతిరేకంగా ఓటు వేయటంతో వివాదం ముదిరింది. కానీ బోర్డులో ఉన్న మరో ముగ్గురు ట్రస్టీలు మాత్రం మిస్త్రీకి అనుకూలంగా మద్దతు ప్రకటించారు. జిమ్మీ టాటా తటస్థంగా ఉండటంతో ఏకాభిప్రాయం లేకుండానే మిస్త్రీ బోర్డు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే 2024 అక్టోబర్ 17న అందరు ట్రస్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో.. ప్రతీ ట్రస్టీ తన ప్రస్తుత పదవికాలం పూర్తయిన వెంటనే శాశ్వత సభ్యుడవుతాడని పేర్కొనబడింది. ఆ తీర్మానం ఏకగ్రీవంగాగా రద్దు చేయకపోతే ఇది చట్టబద్ధంగా అమల్లో ఉంటుందని న్యాయ నిపుణుడు హెచ్ పీ రనినా చెప్పారు. కానీ మిస్త్రీకి వ్యతిరేకంగా ఉన్న ట్రస్టీలు ఆ తీర్మానం చట్టపరమైన విధానాన్ని లేదా ట్రస్టీ బాధ్యతలను మించి ఉండదని అంటున్నారు.
మిస్త్రీ తిరిగి బోర్డులో చోటు దక్కించుకోవటానికి తన తిరస్కరణ ట్రస్ట్ నియమాల ఉల్లంఘన లేదా దురుద్దేశపూర్వకంగా జరిగినట్లు నిరూపించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే చారిటీ కమిషనర్ అధికారాలు పరిమితంగా ఉన్నందువల్ల సమస్య పరిష్కారం అంత ఈజీ కాదని తెలుస్తోంది. బోర్డు నిర్ణయాల మార్పులపై 30 రోజుల్లో ఎవరైనా అభ్యంతరం పెట్టకపోతే కొత్త ట్రస్టీ బోర్డు చట్టబద్ధంగా అమలులోకి వస్తుంది. అయితే అభ్యంతరాలు వచ్చినపుడు విచారణ జరపొచ్చని తెలుస్తోంది. టాటా ట్రస్ట్స్ మార్పులకు సంబంధించిన రిపోర్ట్ చారిటీ కమిషనర్ ముందు 90 రోజుల్లో అందించాల్సి ఉండగా.. మిస్త్రీ ముందస్తుగా కేవియట్ దాఖలు చేయటం కొత్త మలుపుకు దారితీసింది.
