ఈ రోజు (సోమవారం, నవంబర్ 3) ఉదయం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దింతో 10 మంది చనిపోగా, 150 మంది గాయపడ్డారు. యుఎస్‌జిఎస్ తెలిపిన వివరాల ప్రకారం, భూకంప కేంద్రం ఖుల్మ్ నగరానికి పశ్చిమ-దక్షిణ దిశలో 22 కిలోమీటర్ల దూరంలో 28 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:59 గంటలకు చోటుచేసుకుంది.
కొద్దిరోజుల క్రితం కూడా ఒక చిన్న భూకంపం వచ్చింది. అక్టోబర్ 29న 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో నమోదైందని, దీని వల్ల తరువాత కూడా భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని NCS సోషల్ మీడియాలో తెలిపింది.
అలాగే అక్టోబర్ 24న ఆఫ్ఘనిస్తాన్‌లో తెల్లవారుజామున 3.7 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. అది సుమారు 80 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకుంది.
ఇక 31 ఆగస్టు 2025న పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా 6.0 తీవ్రతతో భూకంపం సంభవించగా, 2 వేల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 7 అక్టోబర్ 2023న కూడా 6.3 తీవ్రతతో భూకంపం తరువాత పెద్ద ఎత్తున ప్రకంపనలు జరిగి, కనీసం 4 వేల మంది చనిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు భూకంపాలు వస్తున్నాయంటే : ఈ దేశం భారత - యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఉంది. ఈ రెండు భారీ భూభాగాలు ఒకదానికొకటి తగులుతూ ఉండడం వల్ల భూమి పగుళ్లు ఏర్పడతాయి. ఈ ఒత్తిడి కారణంగా హిందూ కుష్ పర్వతాలలో భూమి భాగాలు లోతుగా కిందికి సాగిపోతాయి. ప్రత్యేకంగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని పామిర్-హిందూ కుష్ ప్రాంతం చాలా బలమైన భూకంపాలకు కేంద్రంగా ఉంటుంది. అక్కడ కొన్ని భూప్రకంపనలు 200 కిలోమీటర్ల లోతులో జరుగుతాయి. ఇది ప్రపంచంలో అరుదుగా కనిపించే విషయం.
