తిప్పర్తి లో ముందస్తు జనగణనను జాగ్రత్తగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

తిప్పర్తి లో ముందస్తు జనగణనను జాగ్రత్తగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు :  తిప్పర్తి లో ముందస్తు 2027 జనగణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశించారు. ఆదివారం నల్గొండలోని తిప్పర్తి లో 2027 జనగణన ఎన్యుమరేటర్లు, మంది సూపర్వైజర్లకు రైతు వేదికలో 3 రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2027 జనాభా లెక్కల సేకరణ లో భాగంగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో  ముందస్తు జనగణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేశారన్నారు.  

పట్టణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ, గ్రామీణ ప్రాంతంలో జిల్లాలోని తిప్పర్తి మండలం, గిరిజన ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయని తెలిపారు. తిప్పర్తి మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి ,జంగారెడ్డిగూడెం లలో జనగణన చేయనున్నారని తెలిపారు.  మొదటిసారిగా  డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహిస్తున్నందున ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు వస్తే రాష్ట్ర స్థాయికి ఈ సమస్యలను తీసుకువెళ్లడం ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

జనగణన ఈ నెల 10 నుంచి 15 వరకు తిప్పర్తిలోని ఐదు గ్రామాలలో ఎన్యుమరేటర్లు ఇండ్లకు వెళ్లి మొబైల్ యాప్ లో ఇండ్లను మ్యాపింగ్ చేస్తారని, అనంతరం ఈనెల 15 నుంచి 30 వరకు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన ప్రొఫార్మాలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను పూర్తి వివరాలతో సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రాష్ట్ర గణాంక శాఖ జెడి లాజరస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.