- అరుణోదయ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క
శాయంపేట, వెలుగు: ఆపరేషన్ కగార్ అంటే నక్సలైట్లను మట్టుబెట్టడానికో, ఆదివాసీలను చంపడం కోసమో కాదు.. ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టి అక్కడున్న అపార ఖనిజ సంపదను కొందరికి కట్టబెట్టడానికి చేస్తున్న కుట్ర అని అరుణోదయ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఆదివారం విమలక్క, కరీంనగర్ రిటైర్డ్ విద్యాశాఖ డైరెక్టర్ కొల్లూరు మల్లేశంతో కలసి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ముందుగా వారు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కార్యక్రమ నిర్వాహకుడు, విగ్రహదాత గ్రామానికి చెందిన వైనాల రాజేందర్ (రాజు) అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో విమలక్క మాట్లాడారు. తెలంగాణ అమవీరుల ఆశయాలకు అనుగుణంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించినప్పుడే వారి వారసులుగా మనం గుర్తింపు పొందుతామన్నారు.
అనంతరం విగ్రహ స్థల దాత వంగాల నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్, జువైనల్ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆలువాల రాజేందర్, ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్, కులసంఘాల నాయకులు కల్లెపు సుదర్శన్, సామల ధనుంజయ, మామిడి భాస్కర్, గుండారపు రవీందర్, ఆకుల శంకర్, ఆకుల ప్రభాకర్, మునుకుంట్ల రవి, పైండ్ల సమ్మయ్య, కట్ల మోహన్‌రెడ్డి, చాడ సాంబరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
