కేసులు ఎక్కువైతున్నయ్​.. మాస్కులు పెట్టుకోండి

కేసులు ఎక్కువైతున్నయ్​.. మాస్కులు పెట్టుకోండి

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో రెండు వారాల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీనివాసరావు తెలిపారు. పోయిన వారంతో పోలిస్తే ఈ వారం కేసులు 56 శాతం పెరిగాయన్నారు. అయితే, ఫోర్త్​ వేవ్​ వచ్చే అవకాశాలు మాత్రం లేవని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తున్నప్పుడు, జనంలో ఉన్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాస్క్​ పెట్టుకోకుంటే ఫైన్​ వేసే అధికారం పోలీసులకు ఉన్నదని, ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

శుక్రవారం కోఠిలోని కొవిడ్​ కంట్రోల్​ రూమ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతటా కరోనా మళ్లీ పెరుగుతోందన్నారు. దేశంలో వారం రోజుల వ్యవధిలోనే పాజిటివిటీ రేటు 0.7 నుంచి 1.24 శాతానికిపెరిగిందని, తెలంగాణలో 0.4 నుంచి 0.7 శాతానికి పెరిగిందని చెప్పారు. ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్ల వల్లే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మే, జూన్​లో 527 శాంపిళ్లకు జీనోమ్​ సీక్వెన్స్​ చేస్తే 65 శాతం బీఏ 2 వేరియంట్​ కేసులున్నట్టు తేలిందన్నారు. బీఏ 4, బీఏ 5 వేరియంట్ కేసులు 9 (3 శాతం) బయటపడ్డాయన్నారు. మనదేశంలో ఇంతకుముందే  ఒమిక్రాన్​ విజృంభించినందున, ఇప్పుడు వాటి సబ్​ వేరియంట్ల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చన్నారు. 

సబ్​ వేరియంట్ల వల్ల కేసుల సంఖ్య పెరిగినా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండకపోవచ్చని, మరణాలు కూడా నమోదు కాకపోవచ్చని పేర్కొన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా లక్షణాలుంటే వెంటనే టెస్ట్​ చేయించుకోవాలని సూచించారు. పిల్లలు, పెద్దలంతా తప్పనిసరిగా వ్యాక్సిన్​ వేయించుకోవాలని శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం దగ్గరపడుతుండడంతో సీజనల్​ వ్యాధుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.


కొత్తగా 155 కరోనా కేసులు రాష్ట్రంలో కరోనా కేసులు వరుసగా మూడో రోజూ వందకుపైగా నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 155 మంది వైరస్ బారిన పడ్డారని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,319 మందికి టెస్టు చేస్తే, 155 మందికి పాజిటివ్‌‌ వచ్చిందని వెల్లడించింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 81, రంగారెడ్డిలో 42, మేడ్చల్‌‌లో 11, సంగారెడ్డిలో 8 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఒకట్రెండు కేసులు వచ్చాయని చెప్పింది. ప్రస్తుతం యాక్టివ్‌‌ కేసుల సంఖ్య 907కు పెరిగిందని తెలిపింది.