జవహర్ నగర్ అంటేనే గంజాయి తాగేవాళ్లకు అడ్డా: స్థానికులు

జవహర్ నగర్ అంటేనే  గంజాయి తాగేవాళ్లకు అడ్డా: స్థానికులు

బాలిక మిస్సైన సమయంలో చెరువు వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ కనిపించారని బంధువులు చెబుతున్నారు. దానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దమ్మాయిగూడ చెరువు ప్రాంతం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి తాగడం నిత్యకృత్యంగా మారిందని అంటున్నారు. జవహర్ నగర్ పీఎస్లో ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

చెరువులో చిన్నారి మృతదేహం

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా చెరువు వద్దకు వెళ్లగా చిన్నారి శవం నీటిపై తేలుతూ కనిపించింది. వెంటనే చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. డెడ్ బాడీని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కనీసం హాస్పిటల్లో సైతం తమ కూతురు మృతదేహాన్ని చూపించలేదని పేరెంట్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.