ఇంకెన్ని మార్పులు చేస్తారో! కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు

ఇంకెన్ని మార్పులు చేస్తారో! కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు

భారత్ వేదికగా జరిగిన వ‌న్డే ప్రపంచ క‌ప్‌లో లంకేయులు పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట విజయం సాధించి లీగ్ దశలోనే నిష్రమించారు. ఈ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్‌లో అనేక పరిమాణాలు చోటుచేసుకున్నాయి.  ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ ను సస్పెండ్ చేసిన ఐసీసీ.. ఆ తర్వాత కొన్ని నిబంధనల ప్రకారం నిషేధాన్ని ఎత్తేసి ఊరటనిచ్చింది. అనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

 కొత్త చైర్మన్ గా ఉపుల్ తరంగను నియమించిన ఆ దేశ క్రికెట్ బోర్డు.. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్లను నియమించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టెస్టు కెప్టెన్ కరుణరత్నేపై వేటు వేసి ఆల్ రౌండర్ ధనంజయ్ డిసిల్వాను కొత్త కెప్టెన్ గా నియమించింది. కరుణరత్నే 30 టెస్టుల్లో శ్రీలంకకు నాయకత్వం వహించాడు. 12 విజయాలు, 12 ఓటములతో పాటు ఆరు టెస్టులు డ్రాగా ముగిసాయి.  2019లో కరుణ రత్నే దక్షిణాఫ్రికాలో శ్రీలంకకు చారిత్రాత్మక సిరీస్‌ని అందించాడు.

స్వ‌దేశంలో జింబాబ్వేతో జరగనున్న వ‌న్డే, టీ20 సిరీస్ కోసం కొత్త కెప్టెన్ల‌ను ఇదివరకే ప్రకటించింది. ప్ర‌పంచ‌క‌ప్‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన‌ వ‌న్డే కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌పై వేటు వేస్తూ.. కుశాల్ మెండిస్‌కు ఆ బాధ్యతలు అప్ప‌గించింది. ఇక మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌నిందు హ‌స‌రంగను టీ20 కెప్టెన్‌గా నియమించింది.