దసరాకు ‘ధరణి’ డౌటే! పూర్తి కాని ఆస్తుల నమోదు

దసరాకు ‘ధరణి’ డౌటే! పూర్తి కాని ఆస్తుల నమోదు

ఆస్తుల నమోదు కార్యక్రమం ఇంకా పూర్తి కాలె

ఓపెన్ ప్లాట్లకు మెరూన్ పాస్ బుక్ ఇచ్చేదానిపై నో క్లారిటీ
కొత్త రెవెన్యూ చట్టాన్ని నోటి ఫై చేయలె
పోర్టల్ ప్రారంభానికి ఇంకొంత టైమ్ పట్టొచ్చంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్​, వెలుగు: దసరా రోజున ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారా? లేదా? అనే అయోమయం ఆఫీసర్ల మధ్య నెలకొంది. దసరాకు ఇంకా రెండు రోజుల టైం మాత్రమే ఉంది. అయితే.. ఇంతవరకు పోర్టల్ ప్రారంభంపై ప్రగతిభవన్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న  ధరణి పోర్టల్ ప్రారంభాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ముందుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కానీ, ప్రజల ఆస్తుల నమోదు కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదు. ఓపెన్ ప్లాట్స్ కు పాస్ బుక్  ఇవ్వాలా?  లేదా? అనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  దీంతో పోర్టల్ ప్రారంభంపై ఊగిసిలాట కొనసాగుతోందని ఆఫీసర్లు అంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. ధరణి పోర్టల్ లో ఉన్న ఆస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సెప్టెంబర్​  7న గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ సేవలను నిలిపేసింది. ధరణి పోర్టల్ ను దసరా రోజున స్టార్ట్​ చేసి రిజిస్ట్రేషన్ సేవలను తిరిగి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. కానీ రెవెన్యూ శాఖ లో ప్రస్తుతం అలాంటి హడావుడి లేదని ఆఫీసర్లు అంటున్నారు.

ఆస్తుల నమోదు సగం కూడా కాలె

ఆస్తుల నమోదు కార్యక్రమం పూర్తి కాలేదు. గ్రామ స్థాయిలో మెజార్టీ ఆస్తుల నమోదు జరిగినా.. మున్సిపల్ ఏరియాల్లో సగం కూడా పూర్తి కాలేదు.  జీహెచ్ఎంసీ పరిధిలో 20 శాతం మాత్రమే ఆస్తులు నమోదు చేశారు. సగం ఆస్తుల నమోదుతో పోర్టల్ ప్రారంభించడం మంచిది కాదనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ‘‘సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దసరా కు పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రారంభించాలని అనుకున్నరు. పండుగ ఇంకా రెండు రోజులే ఉంది. కానీ ఇప్పటివరకు పోర్టల్ ప్రారంభం కోసం ఎలాంటి సమాచారం అందలేదు’’ అని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ పేర్కొన్నారు. పోర్టల్​లో కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేయాల్సి ఉంటుందన్నారు.

ఓపెన్ ప్లాట్లకు మెరున్ పాస్ బుక్ ఇస్తరా?

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. ఇప్పట్నించి ఇండ్లు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మెరున్ పాస్ బుక్ ఇస్తారు. మరి ఓపెన్ ప్లాట్స్  కొనుగోలు చేసిన వ్యక్తులకు మెరున్ పాస్ బుక్ ఇవ్వాలా? లేదా?  ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఇంతవరకు ఓపెన్  ప్లాట్ల వివరాలను ప్రభుత్వం సేకరించలేదు. మరి ఆ వివరాలను ధరణి పోర్టల్ లో ఎలా ఎంట్రీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకున్నాకే  పోర్టల్ ను ప్రారంభించే చాన్స్ ఉందని రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఓ సీనియర్ ఆఫీసరు చెప్పారు.

5 లక్షల మంది ఎదురుచూపులు

సెప్టెంబర్​ 7 నుంచి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ సేవలు నిలిపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇండ్లు,ఇండ్ల జాగాలు, అపార్ట్ మెంట్స్ లోని ప్లాట్స్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్త చట్టం అమల్లోకి రాలేదు

కొత్త రెవెన్యూ చట్టం ఇంతవరకు అమల్లోకి రాలేదు. అసెంబ్లీ ఆమోదించడం, గవర్నర్ ఆమోద ముద్ర వేయడమే జరిగింది. ఫలానా రోజు నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫై చేస్తూ జీవో జారీ చేయాలి. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలనుకుంటే ఇప్పటికే  ప్రభుత్వం కొత్త చట్టాన్ని నోట్ ఫై చేసేదని ఆఫీసర్లు అంటున్నారు.

For More News..

మాజీ ఎమ్మార్వో నాగరాజు లాకర్లలో కిలోపావు బంగారం

‘సంగమేశ్వరం’పై ముందుకెళ్లొద్దు

నేను రాజీనామా చేస్త.. లేకపోతే నువ్వు చెయ్‌‌