ధరణి బాధలు తీరేదెన్నడు?

ధరణి బాధలు తీరేదెన్నడు?

తెలంగాణ రైతులు ధరణితో సమస్యలు తీరుతాయని భావించారు. కానీ ధరణియే సమస్యగా మారుతుందని ఏ రైతూ భావించలేదు.  భూన్యాయ నిపుణులు ఇవాళ చెపుతున్న ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో సుమారుగా 30శాతం ధరణి బాధితులుగా ఉన్నారని తేలింది. ధరణి ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దాటుతున్నా.. సమస్యల పరిష్కారం ఇప్పటికీ కనిపిస్తున్న జాడలేదు.  ఈ సమస్యలతో తల్లడిల్లుతున్న రైతులకు న్యాయ సలహాలివ్వడానికి భూన్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, న్యాయవాదులు, బుద్ధిజీవులు గ్రామాల్లో భూ న్యాయ శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా న్యాయ సలహాలు, సూచనలు చేయడం బాధ్యతగా తెలంగాణ సోషల్​ మీడియా ఫోరం కూడా భావించింది. ఏం చేస్తే ఈ ధరణి కల్పిస్తున్న చిక్కులకు పరిష్కారం  దొరుకుంతుందో కూడా శిబిరాల్లో న్యాయ నిపుణులు   ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తెలంగాణలో సమగ్ర భూసర్వే  జరపడమే ఉత్తమ మార్గం. అలాంటి సమగ్ర సర్వే జరిపేవరకు, ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసి ధరణి బాధితుల సమస్యలు  కొన్నైనా తీర్చబడుతాయి.  భూ సమస్యలు తీరాలంటే ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి.  సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అసెంబ్లీలో మంత్రులు ధరణి మీద  ఏమేమో మాట్లాడుతున్నారు.  గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు పెడితే సమస్యలేమిటో ప్రభుత్వ పెద్దలకు తెలిసివస్తాయి. ధరణిలో సమస్యలే లేవు,  చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే ఉన్నాయని ఒక మంత్రి అసెంబ్లీలో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.   సమస్యలు మంత్రిగారికి చిన్నవే కావచ్చు. కానీ పేద రైతు జీవితానికి అదొక పెద్ద సమస్య.  అసలు ధరణి ఏర్పాటులో చిన్న చిన్న సమస్యలే కాదు, పెద్ద పెద్ద పొరపాట్లే ఉన్నాయని వార్తలున్నాయి. ‘శ్రీ’ పేరున ఉన్న 3లక్షల ఎకరాల భూమి ఎవరిదనే ప్రశ్న  ఉంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎన్నడూ జవాబే చెప్పలేదు.  అనాథ భూములు లక్షల ఎకరాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. అలాంటి లక్షలాది ఎకరాల భూములు ఏం కానున్నాయి? ఎవరి సొంతం కానున్నాయి?  మరో వైపు ధరణి పొరపాట్లతో పేద రైతుల భూములకు పరిష్కారాలు దొరకని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి నిద్ర ఎట్లా పడుతున్నదో అర్థం కాదు! ధరణి ఏర్పాటు కూడా  వాళ్ల కోసమేనా? రైతుల కోసం కాదా? అనే నైతిక ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. అనాథ భూములకు, ధరణి పొరపాట్లలో చిక్కుకున్న పేద రైతుల భూములకు రెండేండ్లుగా ప్రభుత్వం జవాబు చెప్పే ప్రయత్నం చేయకపోవడం, పరిష్కారం వెదకడంలో ఆసక్తి చూపకపోవడం మహా దారుణం. 

తెలంగాణ అస్థిత్వమే భూమి

ఇంకా చెప్పాలంటే, తెలంగాణ అస్థిత్వం అంటేనే భూమి. అలాంటి భూమిపై 30శాతం రైతాంగం ధరణి చిక్కుల్లో చిక్కుకున్నారంటే.. ఇంకెక్కడ తెలంగాణ?  తెలంగాణ రైతుల భూమి హక్కులు ఇన్ని చిక్కుల్లో చిక్కుకుని ఏండ్లు గడుస్తున్నా మన ప్రభుత్వ పెద్దలకు అవి చిన్న చిన్న పొరపాట్లుగా కనిపించడం ఒక విచిత్రం! అలాంటి వైఖరి తెలంగాణ అస్థిత్వానికి ఏమేరకు మంచిదో అందరూ ఆలోచించాలి. ఇప్పటికైనా తెలంగాణ అస్థిత్వ సోయి ఉంటే.. ప్రభుత్వ పెద్దలు భూన్యాయ నిపుణుల సలహాలనైనా  గౌరవంగా స్వీకరించాలి. పాటించాలి. పేద రైతులకు న్యాయం చేయాలి. ఇతర అనాథ భూములు కబ్జాదారుల, బినామీల పాలు కాకుండా కాపాడాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ధరణి బాధిత పేదరైతుల భూ సమస్యలు తీర్చాలనే నిజాయితీ ఉంటే.. వెంటనే సమగ్ర భూసర్వే చేపట్టాలి. ప్రతి గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. అప్పటి వరకు ప్రతి జిల్లాలో ఒక రెవెన్యూ ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలి. ఏ ఒక్క పేద తెలంగాణ రైతుకు అన్యాయం జరిగినా అది తెలంగాణకు అన్యాయం జరిగినట్లే. ఏ ఒక్క పౌరునికి అన్యాయం జరగకుండా చూసేవాడే నిజమైన పాలకుడు. తెలంగాణ అస్థిత్వం పేరున అధికారం చేపట్టిన పాలకులకు తెలంగాణ పేద రైతుల ధరణి బాధలు ఎందుకు అర్థం కావడం లేదనేదే అసలు ప్రశ్న.

కరుణాకర్​ దేశాయి, తెలంగాణ సోషల్​ మీడియా ఫోరం