ధరణి తప్పులను గ్రామస్థాయిలో పరిష్కరించాలి : భూమి సునీల్

ధరణి తప్పులను గ్రామస్థాయిలో  పరిష్కరించాలి : భూమి సునీల్

హైదరాబాద్, వెలుగు: గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించి.. ధరణిలో ఉన్న తప్పులను పరిష్కరించాలని ల్యాండ్ ఎక్స్‌‌పర్ట్ భూమి సునీల్ డిమాండ్ చేశారు. రికార్డుల్లో తప్పులు ఉంటే సత్వరమే సవరించే మార్గం ఉండాలని, ఆన్‌‌లైన్‌‌లో ఉన్న రికార్డులకు భద్రత ఉండాలని చెప్పారు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి భూమి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 

‘‘భూముల రీ సర్వే చేసి ప్రతి కమతానికి భూదార్ కార్డు ఇవ్వాలి. ఆ భూకమతానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఆ కార్డులో ఉండాలి. ఇప్పుడున్న అన్ని భూచట్టాలను కలిపి ఒకే చట్టంగా చేయాలి. భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి. ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి పెండింగ్‌‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలు ఇవ్వాలి” అని పేర్కొన్నారు. అసైన్డ్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పించాలన్నారు. పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలు అందించాలన్నారు. కౌలుదార్ల కోసం కొత్త కౌలు చట్టం రూపొందించాలన్నారు.

 ‘‘భూమి లేని, వ్యవసాయ ఆధారిత పేద కుటుంబాలకు భూమిని పంచడానికి పథకాన్ని రూపొందించాలి. సీలింగ్ చట్టాన్ని అమలు చేసి, మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పంపిణీ చేయాలి. భూ వివాదాల పరిష్కారానికి జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి. పేదలకు ఉచిత న్యాయ సాయం అందించాలి. నిషేధిత ఆస్తుల జాబితాలో తప్పుగా నమోదైన పట్టా భూములను గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి వెంటనే ఆ జాబితా నుంచి తొలిగించాలి” అని కోరారు.