ధరణి డేటా.. విదేశీ కంపెనీ చేతుల్లోనే

ధరణి డేటా.. విదేశీ కంపెనీ  చేతుల్లోనే
  • టెర్రాసిస్​ ఓపెన్​ నోటీస్​తో బయటపడ్డ వాస్తవాలు
  • 2018 మేలో ప్రాజెక్టును దక్కించుకున్న ఐఎల్ఎఫ్ఎస్ 
  • 4 నెలలకే డిఫాల్ట్ లిస్టులో చేరిన కంపెనీ.. 
  • అయినా ప్రాజెక్టును వెనక్కి తీసుకోని సర్కార్​
  • 2021లో ఐఎల్​ఎఫ్​ఎస్​ నుంచి మెజార్టీ వాటా కొని, టెర్రాసిస్​గా మార్చిన సింగపూర్​ కంపెనీ ఫాల్కన్​
  • అనంతరం శ్రీధర్ రాజు చేతికి ‘టెర్రాసిస్​ ఇండియా’ బిజినెస్​
  • వరుస ఆరోపణలతో తొలిసారి స్పందించిన టెర్రాసిస్​
  • భూ వివరాలు, రైతుల డేటా తమకు యాక్సెస్​ లేదని వెల్లడి_

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అనేక భూవివాదాలకు, రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన ధరణి పోర్టల్ పుట్టుపూర్వోత్తరం, చేతులు మారిన చరిత్ర ఎట్టకేలకు బయటికొచ్చింది. ఇన్నాళ్లూ పోర్టల్ ఎవరి చేతుల్లో ఉన్నదనే విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా,  ఆర్టీఐ ద్వారా ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా సర్కార్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ను నిర్వహిస్తున్న టెర్రాసిస్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీయే స్వయంగా పబ్లిక్ నోటీస్ పేరిట అడ్వర్టయిజ్ మెంట్ రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  

ల్యాండ్ రికార్డుల నిర్వహణ కోసం తెలంగాణ సర్కార్ తో ఫిలిప్పీన్స్​కు చెందిన ఐఎల్ఎఫ్​ఎస్ కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నది మొదలు, ఆ కంపెనీ ఆర్థిక సంక్షోభంలో వెళ్లడం, దాన్ని సింగపూర్​కు చెందిన ఫాల్కన్ ఎస్ జీ కొనుగోలు చేయడం, ఆ తర్వాత కంపెనీ పేరు మారడం, తన ఇండియా బిజినెస్​ను గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా కంపెనీకి అప్పగించడం వరకు జరిగిన పరిణామాలు పబ్లిక్​ నోటీస్​లో వెల్లడయ్యాయి. భూ వివరాలు, రైతుల డేటా షేర్ చేసేందుకు తమకు యాక్సెస్​ లేదని సదరు కంపెనీ ప్రకటించినప్పటికీ.. విదేశీ కంపెనీ చేతుల్లోనే ధరణి ఉందని ఇన్నాళ్లూ వచ్చిన ఆరోపణలకు ఈ పబ్లిక్ నోటీస్ మరింత బలం చేకూర్చింది. భారీ ఎత్తున పత్రికల్లో అడ్వర్టయిజ్​మెంట్​ రూపంలో వివరణ ఇచ్చిన సదరు కంపెనీ తన అడ్రస్ గానీ, యాడ్ ఇచ్చిన అధికారి లేదా మేనేజ్ మెంట్ వివరాలుగానీ చివరలో పేర్కొనకపోవడం గమనార్హం.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న కంపెనీతో అగ్రిమెంట్​

ధరణి నిర్వహణ విషయమై టెర్రా సిస్ టెక్నాలజీ వివరణ ఇచ్చినా.. ఇందులో సర్కార్ వైపు నుంచి నివృత్తి చేయాల్సిన అనుమానాలు అనేకం ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్​ మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్​)కు సంబంధించిన సాఫ్ట్ వేర్ డిజైన్, డెవలప్ మెంట్, ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8న తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ ఎఫ్ పీ)ను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ధరణి ప్రాజెక్టును దక్కించుకుని 2018 మే నెలలో ప్రభుత్వంతో  అగ్రిమెంట్ చేసుకుంది. అప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ కంపెనీ బ్యాంకులకు లక్ష కోట్ల లోన్లు ఎగ్గొట్టి దివాలా తీసింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆర్ ఎఫ్ పీలోని రూల్స్‌ ప్రకారం.. సదరు కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ అగ్రిమెంట్ చేసుకున్న నాలుగు నెలలకే ఐఎల్​ఎఫ్​ఎస్​ కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరినా.. రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి ఏపీలో సత్యం కంప్యూటర్స్​ సంస్థలో స్కామ్​ జరిగినప్పుడు ఆ సంస్థకు చెందిన మైటాస్ కు ఇచ్చిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్ అండ్ టీకి అప్పగించారు. కానీ ధరణి ప్రాజెక్టు విషయంలో అట్ల జరగలేదు. 

ALSO READ :తాజ్మహల్ను తాకిన యమునా నది 

సింగపూర్​ కంపెనీ చేతికి వెళ్లి..!

ధరణి ప్రాజెక్టును దక్కించుకున్న ఐఎల్ఎఫ్ఎస్ లో మెజార్టీ వాటాను 2021 నవంబర్ లో సింగపూర్​కు చెందిన ఫాల్కన్ ఎస్ జీ కంపెనీ రూ.1,275 కోట్లకు కొనుగోలు చేసి  టెర్రా సిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చింది. ఫాల్కన్ కంపెనీ టెర్రా సిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్ లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణిని టెర్రాసిస్​ కంపెనీ నిర్వహిస్తుండగా.. దానికి టెక్నాలజీ సపోర్ట్​ను క్వాంటెలా సంస్థ అందజేస్తున్నది. 

డీ కేటగిరీలో కంపెనీ

టెర్రా సిస్ టెక్నాలజీకి క్వాంటెలా కంపెనీ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తున్నా సర్కార్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ధరణి నిర్వహణను చూసే కంపెనీ టెర్రా సిస్ టెక్నాలజీయే (ఐఎల్ఎఫ్​ఎస్ కు కొత్త పేరు). వ్యక్తులకు లోన్లు ఇచ్చేందుకు సెబిల్ స్కోర్ ఎట్లనో కంపెనీలకు కేర్ రేటింగ్స్ కూడా అట్ల. కేర్ రేటింగ్స్ లో టెర్రా సిస్​ కంపెనీ డీ కేటగిరీలో ఉంది. 2020 అక్టోబర్ 30న, 2023 జనవరి 1న రిలీజ్ చేసిన రిపోర్టులు ఇదే అంశాన్ని వెల్లడిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన లేదా డిఫాల్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలుగా పేర్కొనే డీ కేటగిరీలో ఉన్న కంపెనీ చేతుల్లోనే ధరణి ఉండడం ఆందోళనకరం. 

మరో మూడు నెలల్లో ముగియనున్న కాంట్రాక్ట్​

ధరణి పోర్టల్ ను లాంచ్ చేసిన 2020 అక్టోబర్ 28 నుంచి 2023 అక్టోబర్ 28 వరకు పోర్టల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ను టెర్రా సిస్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. గడువు ముగిసిన తర్వాత ఇదే దివాలా కంపెనీకి అప్పగిస్తారా లేదంటే మంచి రెప్యుటేషన్ ఉన్న ఎన్ఐసీ, సీజీజీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలకు అప్పగిస్తారో మరో మూడు నెలల్లో తేలిపోనుంది.

డైరెక్టర్​గా చేరిన ఒక్కరోజులోనే..!

ధరణి పోర్టల్ శ్రీధర్ రాజు చేతికి చేరిన ఒక్క రోజు ముందే ఆయన టెర్రాసిస్ లో డైరెక్టర్​గా అపాయింట్ అయ్యారు. ధరణి అందుబాటులోకి వచ్చే నాటికి 600 మంది ధరణి ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీళ్లను శ్రీధర్  రాజుకు చెందిన ఇ-–సెంట్రిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. పారాడిగ్మ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ద్వారా జీతాలు ఇస్తున్నారు. ఇదీ ఆయన డైరెక్టర్​గా ఉన్న కంపెనీయే.

8 అంశాలతో టెర్రాసిస్ వివరణ

  • ధరణి పోర్టల్ ద్వారా చెల్లించే స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజుల చెల్లింపులతో టెర్రా సిస్ కు సంబంధం లేదని, ఆ డబ్బులు సర్కార్ ఖజానాకే వెళ్తాయని కంపెనీ పేర్కొంది. 
  • పోర్టల్ మెయింటెనెన్స్ కు ప్రభుత్వం తమకు నెలనెలా చార్జీలు చెల్లిస్తుందని తెలిపింది. 
  • ల్యాండ్ ఓనర్స్ ఆధార్, పాన్ వివరాలను తమ సంస్థ యాక్సెస్  చేయలేదని పేర్కొంది. 
  • ఐఎల్ ఎఫ్​ఎస్ సంక్షోభంలోకి వెళ్లడం, వాటాల కొనుగోలుద్వారా చేతులు మారిన పరిణామాలను టెర్రా సిస్​ వెల్లడించింది. 
  • శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటిలా ఇండిపెండెంట్ హోదాతో టెర్రా సిస్ ఇండియా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. 
  • ఇంత వివరణ ఇచ్చిన సదరు సంస్థ కంపెనీ అడ్రస్ గానీ, అడ్వర్టయిజ్ మెంట్ ఇచ్చిన అధికారి లేదా మేనేజ్ మెంట్ వివరాలుగానీ చివరలో పేర్కొనలేదు.