ఒక్కరోజు ఎస్ఐగా క్యాన్సర్ బాధితురాలు

ఒక్కరోజు ఎస్ఐగా క్యాన్సర్ బాధితురాలు

కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ధారవత్ స్వాతి అనే యువతి ఒకరోజు పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టింది. పోలీస్ డ్రెస్ వేసుకుని.. చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టింది.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ నాయక్ తండాకు చెందిన ధారవత్ చాంప్లా, -రూప దంపతుల కుమార్తె స్వాతి కొన్ని సంవత్సరాల నుంచి ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఉన్నత చదువులు చదువుకుని పోలీస్ కావాలన్నా ఆమె కోరిక, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న ఆ యువతి కలను విధి వక్రీకరించింది. క్యాన్సర్ సోకడంతో తన ఆశలు ఆవిరయ్యాయి.

క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం స్వాతిని తల్లిదండ్రులు చాలా ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. పోలీస్ కావాలన్న తన కోరికను మేక్ ఎ విష్‌ తో ఒక్కరోజు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని తన తల్లిదండ్రులతో కలిసి భేటీ అయ్యింది. తన క్యాంప్ కార్యాలయంలో స్వాతి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి భోజనం చేశారు. అప్పుడే తన మనసులో ఉన్న కోరికను మంత్రికి తెలిపింది స్వాతి. 

ఒక్క రోజు పోలీస్ కావాలన్న తన కోరికను మంత్రికి తెలపడంతో ఏర్పాట్లు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. దీంతో మంగళవారం (జూన్ 6న)  చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఒక్క రోజు ఎస్ఐగా స్వాతి బాధ్యతలు చేపట్టి.. తన కోరికను నెరవేర్చుకుంది.