దళిత, బీసీ బంధు పేర్లతో కేసీఆర్ మోసం చేశాడు : ధర్మపురి అర్వింద్

దళిత, బీసీ బంధు పేర్లతో కేసీఆర్ మోసం చేశాడు : ధర్మపురి అర్వింద్

70 శాతం మంది మహిళలు అంగీకరిస్తేనే గ్రామంలోని వైన్స్ లకు పర్మిషన్ల తొలగింపు, బెల్ట్ షాపుల పర్మిట్ రూములను మూసివేస్తామని చెప్పారు నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ నియోజకవర్గంలో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అడగకముందే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రూ.200 కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం మంజూరు చేశారని చెప్పారు. రూ.500 కోట్లతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ మోసం చేశారని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని బోయవాడలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ధర్మపురి అర్వింద్ మాట్లాడారు. 

ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని అమిత్ షా ప్రకటించారని చెప్పారు అర్వింద్. దళిత బంధు, బీసీ బంధు పేర్లతో ఓట్ల కోసం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తాము మహిళా సాధికారత కోసం పని చేస్తామన్నారు. ఇద్దరు మహిళలకు టికెట్లు ఇప్పించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేషన్ బియ్యం ఇస్తున్నప్పుడు కొత్త కార్డులు ఇవ్వడానికి కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేంటని ప్రశ్నించారు. 

యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.. వారిని తాగుబోతులుగా తయారు చేశాడని ఆరోపించారు అర్వింద్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తారీకు అర్హులందరికీ పెన్షన్లు వస్తాయన్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా గ్రూపులను బలోపేతం చేస్తామని చెప్పారు.