కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో జరుగుతున్న డ్రైనేజీ పనులను వాటర్వర్క్స్ అధికారులు అర్ధాంతరంగా ఆపేవారు. దీంతో శుక్రవారం బస్తీ వాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా ఇక్కడ 1620 కుటుంబాలు నివసిస్తున్నాయని, తాము నివసిస్తున్న స్థలం ఐడీపీఎల్దని అధికారులు ఫిర్యాదు చేయడంతో బస్తీలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే ఆయన నిధుల నుంచి తమ బస్తీలో పనుల కోసం రూ.కోటి, ఎమ్మెల్యే కృష్ణారావు రూ.3 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. బస్తీలో అభివృద్ధి పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

