కేటీఆర్ సార్ ..న్యాయం చేయండి

కేటీఆర్ సార్ ..న్యాయం చేయండి

50 రోజులుగా ఉపాధి లేదు
మేనేజ్ మెంట్ వేడుకున్నా నో రెస్పాన్స్
మంత్రికి కార్మికులు ఉత్తరాలు

హైదరాబాద్ , వెలుగు : రంగారెడ్డి జిల్లా నందిగామ పరిధిలోని హెచ్ బీఎల్ కంపెనీలో 40 మంది కార్మికులను మేనేజ్మెంట్ తీసేయడంతో ఆందోళన బాటపట్టారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఉన్నతాధికారులకు చెప్పుకున్నా స్పందించలేదని, కేటీఆర్ సార్ మీరైనా మాకు న్యాయం చేయండి అంటూ కార్మికులు శుక్రవారం ఉత్తరాలను పోస్టు ద్వారా మంత్రికి పంపించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పని చేస్తున్నామని, ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని వాపోయారు. పర్మినెంట్ కార్మికులైన తమను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధిలేక గత 50 రోజులుగా కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగానైనా న్యాయం చేయమని వేడుకున్నా హెచ్ బీఎల్ మేనేజ్మెంట్ స్పందించడం లేదన్నారు. వేరే గత్యంతరం లేక కంపెనీ ముందు 22 రోజులుగా శాంతియుతంగా నిరసన, సమ్మె  నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నో ప్రజాసంఘాలు మద్దతు తెలిపినా కూడా మేనేజ్మెంట్ ప‌ట్టించుకోకపోవడంతోనే మంత్రి కేటీఆర్ కు న్యాయం చేయాలని లేఖలతో కోరినట్లు కార్మికులు తెలిపారు.