
న్యూఢిల్లీ: - మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎల్ఎఫ్) మాజీ సీఎండీ కపిల్ వాద్వాన్, మాజీ డైరెక్టర్ ధీరజ్ వాద్వాన్, మరో నలుగురిని ఐదేళ్ల వరకు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. నిధులను మళ్లించినందుకు, కంపెనీ బుక్స్‌లో అవకతవకలు ఉన్నందుకు రూ. 120 కోట్ల జరిమానా విధించింది. ఐదేళ్ల వరకు లిస్టెడ్ కంపెనీలో ఎలాంటి కీలక పదవి చేపట్టకూడదని ఆదేశించింది.
కపిల్, ధీరజ్‌తో పాటు, నాన్- ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాకేష్ వాద్వాన్, మాజీ నాన్- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరంగ్ వాద్వాన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హర్షిల్ మెహతా, మాజీ సీఎఫ్ఓ సంతోష్ శర్మలపై కూడా ఆంక్షలు విధించింది. వీళ్లంతా ప్రమోటర్లకు చెందిన బాంద్రా బుక్ ఎంటిటీస్‌కు అక్రమంగా నిధులను మళ్లించారని సెబీ పేర్కొంది.
మార్చి 31, 2019 నాటికి, బీబీఇలకు డీహెచ్ఎఫ్ఎల్ రూ. 14,040.50 కోట్లు బకాయి పడింది. ఈ సంస్థలకు ఎటువంటి ఆస్తులు లేదా వ్యాపారం లేనప్పటికీ, రూల్స్ ఉల్లంఘించి , రిటైల్ హౌసింగ్ లోన్లుగా చూపెట్టి భారీ అన్‌సెక్యూర్డ్ లోన్లను జారీ చేశారని సెబీ స్పష్టం చేసింది.