హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగ్యనగర గడ్డపై అత్యంత ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై లెజెండ్ ఎంఎస్ ధోనీ రాకతో ఈ పోరుకు భారీ క్రేజ్ నెలకొంది. ఈ సీజన్‌లో ఒక్కమ్యాచ్ కూడా ఆడని మహీ తొలిసారి టీమ్‌తో కలిసి ప్రయాణించి హైదరాబాద్ వచ్చాడు.
దాంతో హోమ్ టీమ్ సన్‌రైజర్స్‌కు సపోర్ట్ చేసే భాగ్యనగర ఫ్యాన్స్ సైతం, ఈసారి ధోనీ మెరుపులు చూడాలని ఆరాటపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్‌లో మహీ ఉత్సాహంగా కనిపించాడు. ధోనీ కోసం స్టేడియం మొత్తం నిండిపోవడం ఖాయం. అతను ఆడితే హైదరాబాద్ ఫ్యాన్స్‌కు పండగే. ఇక, సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
గత పోరులో రాజస్తాన్ నడ్డివిరిచిన యంగ్ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్ రాణిస్తే తిరుగుండదు. ఇంకోవైపు సొంత గడ్డపై వరుసగా రెండు విజయాలు సాధించిన సీఎస్కే ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై తొలి గెలుపు కోసం ఎదురుచూస్తోంది. అయితే స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడం ఆ టీమ్‌కు పెద్ద లోటు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో బ్యాటింగ్ భారం మొత్తం ఓపెనర్ సంజూ శాంసన్, యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రేపైనే ఉంది.

