పాక్ అభిమానికి టికెట్ పంపిన ధోని

పాక్ అభిమానికి టికెట్ పంపిన ధోని

భారత మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మైదానంలో ధోని ఆటతీరు, అతడి ప్రవర్తనను ఇష్టపడుతారు. ధోనికి ఇండియాలోనే కాదు దాయాది దేశమైన పాకిస్తాన్ లో  కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

పాక్ లోని కరాచీకి చెందిన మహమ్మద్ బషీర్.. ధోనికి వీరాభిమాని. అతడికి, ధోనికి మధ్య స్నేహం 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి ప్రారంభమైంది. బషీర్ తాజాగా ఆదివారం జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం చికాగో నుంచి మాంచెస్టర్ వచ్చాడు. అయితే అతని దగ్గర మ్యాచ్ చూసేందుకు టికెట్ లేదు. కానీ తనకోసం ధోని తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకంతో మాంచెస్టర్‌కు చేరుకున్నాడట. సరిగ్గా ఆయన అనుకున్నట్లే కెప్టెన్ కూల్.. అతనికి కష్టం కలగకుండా మ్యాచ్ టికెట్ పంపించాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బషీర్ ‘నేను మాంచెస్టర్ నిన్నే వచ్చానని అన్నాడు. ప్రతీ ఒక్కరు టికెట్ కోసం 800-900 పౌండ్లు ఖర్చు చేయడం చూశాను.. కానీ నాకు తిరిగి చికాగో వెళ్ళడానికి కూడా ఆంతే ఖర్చు అవుతుంది. అలాంటి సమయంలో నేను కష్టపడకుండా.. మ్యాచ్‌ను చూసేందుకు సహాయం చేసిన ధోనికి నా కృతఙ్ఞతలు’ అని బషీర్ అన్నాడు. ‘నేను ఎప్పుడూ ధోనికి ఫోన్ చేయను. కేవలం వీలు దొరికినప్పుడల్లా మెసేజ్‌లు పెడుతూ అతనితో టచ్‌లో ఉంటానని’ బషీర్ తెలిపాడు.

ప్రస్తుతం బషీర్ చికాగోలో ఓ రెస్టారెంట్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.