- ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి
- ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మహిళపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు తేలడంతో షాద్‌నగర్ పీఎస్ డిటెక్టివ్ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి, కానిస్టేబుళ్లు కరుణాకర్, మోహన్‌లాల్, రాజు, జాకీర్, మహిళా కానిస్టేబుల్ అఖిలను సస్పెండ్ చేశారు. సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చోరీ కేసులో షాద్‌నగర్‌కు చెందిన భీమయ్య అతని భార్య సునీత, కుమారుడు జగదీశ్‌ను డీఐ రాంరెడ్డి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసిన సంగతి తెలిసిందే. సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి.. శంషాబాద్ ఏసీపీ రంగస్వామితో విచారణ జరిపించారు. ఏసీపీ నివేదిక ఆధారంగా బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.
సునీతకు పలువురి పరామర్శ
బాధితురాలు సునీతను సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, నవీన్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పరామర్శించారు. అనంతరం లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆడపిల్లను మగ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం సభ్యసమాజం తలదించుకునే చర్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేజారిపోయిందని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకొని పోలీసులు రెచ్చిపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సాయంత్రం 6 దాటితే ఆడపిల్లలను పోలీస్ స్టేషన్లో విచారణకు తీసుకురాకూడదన్న విషయం పోలీసులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. బాధిత మహిళలకు కోటి రూపాయల నగదు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
నివేదిక ఆధారంగా చర్యలు: నేరెళ్ల శారద
దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ల శారద అన్నారు. షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సునీతను పరామర్శించారు. ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఏసీపీ రంగస్వామితో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహించదని అన్నారు.
