సెలబ్రేషన్స్‌లో ట్రంప్‌ను పక్కకు నెట్టేసిన రోడ్రి?.. వైరల్ వీడియోతో కొత్త రచ్చ!

సెలబ్రేషన్స్‌లో ట్రంప్‌ను పక్కకు నెట్టేసిన రోడ్రి?.. వైరల్ వీడియోతో కొత్త రచ్చ!

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మెట్‌లైఫ్ స్టేడియంలో స్పెయిన్ ఆటగాళ్లు చారిత్రాత్మక విజయానందంలో మునిగి తేలుతున్న వేళ.. వేదికపై ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి (Rodri), అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఒక చిన్న ఇంటరాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

పోడియంపై అసలేం జరిగింది?: 
స్పెయిన్ జట్టు అర్జెంటీనాను 1–0తో ఓడించిన తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ సెర్మనీ జరిగింది. కెప్టెన్ రోడ్రి తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ట్రోఫీని గాల్లోకి లేపి సెలబ్రేట్ చేసుకోవడానికి అంతా సిద్ధమైంది. ఈ సమయంలోనే యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినోతో కలిసి పోడియం సెంటర్‌లోనే నిలబడి ఉన్నారు. ఆ టైమ్‌లో రోడ్రి.. ట్రంప్ వైపు చూస్తూ చేతులతో ఏదో సైగ చేస్తూ మాట్లాడటం కెమెరాల్లో రికార్డ్ అయింది. టీమ్ ఫోటోస్, సెలబ్రేషన్స్ కోసం సార్, కాస్త పక్కకు తప్పుకోండి అని స్పానిష్ కెప్టెన్  ఆయనను కోరినట్లు తెలుస్తుంది. 

రంగంలోకి దిగిన ఫిఫా బాస్ ఇన్ఫాంటినో: 
వేదికపై ఈ చిన్నపాటి గందరగోళాన్ని గమనించిన ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో వెంటనే అలర్ట్ అయ్యారు. ఆయనే స్వయంగా చొరవ తీసుకుని, డొనాల్డ్ ట్రంప్ భుజంపై చేయి వేసి పోడియం మధ్యలో నుంచి నెమ్మదిగా పక్కకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ చిన్న ఆలస్యం కేవలం కొన్ని సెకన్ల పాటే జరిగినప్పటికీ, ఆ తర్వాత స్పానిష్ ఆటగాళ్లకు స్టేజ్ అంతా ఖాళీ దొరికింది.

ALSO READ : 2010లో 116.. 2026లో 106 నిమిషం! ఎక్స్‌ట్రా టైమ్లో వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్

సోషల్ మీడియాలో మీమ్స్ రాంపేజ్: 
ఈ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను పక్కకు జరగమని అడిగే ధైర్యం ఒక్క రోడ్రికే ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. రోడ్రి చాలా పొలైట్‌గానే అడిగాడు, దాన్ని నెటిజన్లు పెద్దది చేస్తున్నారంటూ మరికొందరు అంటున్నారు.