మంత్రి స్వయంగా చెప్పినా వినడం లేదు..

మంత్రి స్వయంగా చెప్పినా వినడం లేదు..

సూర్యాపేట జిల్లా పాలకవీడులో వందలాది ఎకరాల భూములు కబ్జా

చర్యలు తీసుకోవాలన్న మంత్రి కేటీఆర్

పట్టించుకోని రెవెన్యూ ఆఫీసర్లు

నేరేడుచర్ల, వెలుగు: ‘ప్రభుత్వ భూముల ఆక్రమణలు అడ్డుకోవాలి.. ఆఫీసర్లు రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాలి.. అక్రమార్కుల తోలు తీయాలి’ ఇలా ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కానీ మంత్రి మాటలకు.. ఆఫీసర్ల చేతలకు పొంతన కుదరడం లేదు. వందలాది ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నా ఆఫీసర్లు పట్టనట్లు గా వ్యవహరిస్తున్నారు. రూ. 60 కోట్ల విలువైన భూములు కబ్జా సూర్యాపేట జిల్లా పాలకవీడు కొత్తగా మండల కేంద్రంగా ఏర్పాటైంది. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు కట్టేందుకు భూములు దొరకడం లేదు కానీ, కబ్జా రాయుళ్ల అక్రమాలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈ మండల కేంద్రంలోనే సుమారు రూ.60 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ఏనెలు, గుట్టలు ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని యథేచ్ఛగా చదును చేస్తున్నారు. అలాగే మండల పరిధిలోని బొత్తలపాలెం, గుం డ్ల పహాడ్, గుండెబోయిన గూడెం , జాన్ పహాడ్, శూన్య పహాడ్, సజ్జా పురం శివారులని ప్రభుత్వ, ఫారెస్ట్ భూములు రోజురోజుకు కనుమరుగు అవుతున్నాయి. అయినా రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం తమకేమీ పట్టనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఆఫీస్ లకు స్థలాలు కరువు

పాలకవీడు మండల కేంద్రంగా ఏర్పడి ఐదేళ్లు అవుతున్నా ఆఫీసుల నిర్మాణం జరగలేదు. ప్రభుత్వ ఆఫీసులు కట్టేందుకు స్థలాలు లేవంటూ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు  పంపడం లేదు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్, తహసీల్దా ర్, ఎంపీడీవో ఆఫీసులకు మాత్రమే స్థలాలు గుర్తించారు. అగ్రికల్చర్ ఆఫీస్, కస్తూర్బా స్కూలు, కమ్యునిటీ హాల్, పార్కు, ఇతర ప్రభుత్వ ఆఫీసులకు  ప్రతిపాదనలే పంపలేదు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆఫీసులు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు..

సర్వే నెంబర్          విస్తీర్ణం                       ఆక్రమణకు గురైంది

84                             7.34                          3.34

87                            1.11                           1.11

93                             2.20                          1.20

97                            9.30                         6.30

101                           4.30                          4.30

142                           6.22                           3

194                           2.24                          2

307                           11.33                        4.33

407                            4,23                         2,30

445                           10.28                          5

 

స్వాధీనం చేసుకుంటాం

ఆక్రమణలు జరుగుతున్న ప్రదేశాల్లో పనులు నిలిపివేయించాం. సర్వేయర్ లేకపోవడంతో సర్వే ఆలస్యమవుతోంది. సర్వే చేయించాలని కలెక్టర్ కు ప్రపోజల్స్‌ పంపించాం. హద్దులు నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

జి.కృష్ణా నాయక్, తహసీల్దా ర్, పాలకవీడు.