నల్గొండ కాంగ్రెస్లో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

నల్గొండ కాంగ్రెస్లో  మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రియాంక గాంధీ సభని విజయవంతం చేయాలని కార్యకర్తలతో ఆర్ అండ్ బిగెస్ట్ హౌస్ లో జానారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ నాయకులు చెరుకు సుధాకర్ , పున్నకైలాస్ , తండు సైదులు గౌడ్ ,కొండేటి మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఎస్సీ, బీసీ నాయకులను పట్టించుకోవడం లేదంటూ జానారెడ్డి ముందు  అవేదన వ్యక్తం చేశారు. తాము పార్టీకి అవసరం లేదని క్లియర్ గా చెప్తే.. తమ దారి తాము చూసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్ పార్టీ అగ్రవర్గాలకే పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో రేవంత్ రెడ్డి సభలో  కూడా బీసీ నాయకులను పట్టించుకోలేదని చెరుకు సుధాకర్, పున్న కైలాస్ వంటి బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యతనిస్తూ.. తమను లెక్క చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ సభకు జన సమీకరణ చేసే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. అధికార పార్టీ తమకు డబ్బు ఆశ చూపించినా.. పార్టీని వీడలేదంటూ జానారెడ్డి ముందు వాపోయారు.