బీటెక్ స్టూడెంట్ ఫీజు కట్టలేకపోయాడు.. భర్తతో ఉండటానికి ఇష్టపడని ఓ భార్య.. పెళ్లి ఇష్టం లేదని మరోయువతి.. వీరంతా ఏం చేశారో తెలుసా..!

బీటెక్ స్టూడెంట్ ఫీజు కట్టలేకపోయాడు.. భర్తతో ఉండటానికి ఇష్టపడని ఓ భార్య.. పెళ్లి ఇష్టం లేదని మరోయువతి.. వీరంతా ఏం చేశారో తెలుసా..!
  • ఫీజు కట్టలేక బీటెక్‌‌ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌
  • సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ఘటన
  • వేర్వేరు కారణాలతో  వరంగల్‌‌ జిల్లాలో మహిళ, గద్వాల జిల్లాలో యువతి ..

బోయినిపల్లి, వెలుగు : కాలేజీ ఫీజు కట్టలేకపోవడంతో పాటు తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై బీటెక్‌‌ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి పరిధిలోని దుబ్బపల్లిలో బుధవారం జరిగింది. ఎస్సై రమాకాంత్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బపల్లి గ్రామానికి చెందిన రామంచ సంజయ్‌‌ (18) హైదరాబాద్‌‌లోని ఓ ప్రైవేట్‌‌ కాలేజీలో బీటెక్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కట్టకపోవడంతో  మూడు నెలల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో పాటు అతడి తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన సంజయ్‌‌ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి తండ్రి రామంచ అశోక్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

భర్తతో కాపురం చేయలేక భార్య..

వర్ధన్నపేట, వెలుగు : మానసిక పరిస్థితి సరిగా లేని భర్తతో కాపురం చేయలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇల్లందకు చెందిన నాంపెల్లి కుమారస్వామి కూతురు అనూషకు తొమ్మిదేండ్ల కింద తొర్రూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొన్ని రోజులుగా అనూష భర్త మానసికస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌‌లోని ఎర్రగడ్డ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. దీంతో అనూష ఇల్లందకు వచ్చి కూలీ పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో కాపురానికి వెళ్లాలని తల్లి కొమురమ్మ సూచించడంతో మనస్తాపానికి గురైన అనూష సోమవారం గడ్డి మందు తాగింది. వెంటనే 108లో వరంగల్‌‌ ఎంజీఎంకు తరలించగా, అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ మంగళవారం రాత్రి చనిపోయింది. 

పెండ్లి ఇష్టం లేక యువతి...

గద్వాల, వెలుగు : పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన మహేశ్వరి కూతురు స్నేహ (19) ఇంటర్‌‌ చదువుతోంది. కేటీ దొడ్డి మండల కేంద్రానికి చెందిన హరికి గతంలోనే వివాహం జరుగగా.. అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్నేహతో రెండో పెండ్లి చేసేందుకు నిశ్చయించారు. పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో స్నేహ బుధవారం ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు కర్ణాటకలోని రాయచూర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.