ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు

ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు

ఏపీలో వింత వాతావరణం నెలకొంది.. పగలంతా వడగాల్పులు, సాయంత్రం అయితే పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు జనం. అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపటిలా మండిపోతోంది రాష్ట్రం. ఒకవైపు తీవ్రమైన ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిబిక్కిరి అవుతుంటే... మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వింత వాతావరణంతో రైతులు, తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. శనివారం ( మే 30 ) వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు చేరుతాయని తెలుస్తోంది. ప్రకాశం, బాపట్ల, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 45 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతవరణ శాఖ. 

ఎండ తీవ్రత, వడగాల్పులు మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.మొత్తం 163 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.