కరోనా సెలవులతో సర్కారీ సదువులు ఆగం

కరోనా సెలవులతో సర్కారీ సదువులు ఆగం
  • సిలబస్ పూర్తి కాకముందే మళ్లీ కరోనా సెలవులు
  • ఇప్పటికే సగానికిపైగా  స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు బేసిక్స్ వస్తలే
  • ప్రైవేటులో ఎప్పట్లాగే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్​ క్లాసులు.. సర్కారు స్కూళ్ల స్టూడెంట్లకే కష్టాలు
  • టీవీ క్లాసులపై ఇంకా నిర్ణయం తీసుకోని ఆఫీసర్లు
  • వాటి వల్ల అస్సలు ఉపయోగం లేదంటున్న ఎక్స్​పర్ట్స్
  • ఆందోళనలో పేరెంట్స్

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్, వెలుగు: కరోనాతో సర్కారీ స్కూళ్ల స్టూడెంట్ల సదువులు ఆగమవుతున్నాయి. ఫిజికల్ క్లాసులు మూణ్నెల్ల ముచ్చటగానే మారాయి. కొవిడ్​ దెబ్బకు రెండేండ్లుగా క్లాసులు సరిగ్గా జరక్క.. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, టీవీ క్లాసులు అర్థం కాక పిల్లలు మినిమం బేసిక్స్ మరిచిపోయారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న చదువులు కరోనా వల్ల మళ్లా మొదటికొచ్చాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను ఈ నెల చివరి వరకు సర్కారు పొడిగించింది. కానీ ప్రభుత్వ బడుల్లో క్లాసుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఇదే సమయంలో చాలా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు సోమవారం నుంచే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ క్లాసులు ప్రారంభించాయి. మరోవైపు జనవరి చివరికల్లా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌‌‌‌‌‌‌‌కు వెళ్తుందని, ఫిబ్రవరిలోనూ ఎఫెక్ట్ ఎక్కువే ఉంటుందని హెల్త్ డిపార్ట్​మెంట్ చెబుతోంది. ఫిబ్రవరిలోనూ ఫిజికల్ క్లాసులు జరగకపోతే సర్కారు బడుల్లోని లక్షలాది మంది పిల్లల చదువులు మళ్లీ ఆగంపట్టనున్నాయి. ఒకవేళ ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆన్​లైన్, టీవీ క్లాసులు పెట్టాలని అనుకున్నా.. పేదకుటుంబాల్లో పిల్లల వద్ద సెల్​ఫోన్లు, ట్యాబ్​లు లేక, రూరల్ ఏరియాల్లో సిగ్నల్స్, పవర్​కట్స్ తదితర సమస్యలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. దీంతో సర్కారు బడుల్లో సదువులపై స్టూడెంట్స్, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఆందోళన నెలకొన్నది.

2020 మార్చి నుంచి ఇదే పరిస్థితి

రాష్ట్రవ్యాప్తంగా 40,898 స్కూళ్లలో 60 లక్షల మంది స్టూడెంట్స్​ఉన్నారు. వీరిలో 22 లక్షల మంది సర్కారు బడుల్లో, 4.5 లక్షల మంది గురుకులాల్లో, మిగిలిన 33.5 లక్షల మంది ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్నారు. 2020 మార్చిలో లాక్​డౌన్‌‌‌‌‌‌‌‌తో చదువులపై ఎఫెక్ట్ మొదలైంది. ప్రైవేట్, కార్పొరేట్​ స్కూళ్లలో ఆన్​లైన్ క్లాసులు పక్కాగా నడిచినా.. సర్కారు బడుల్లో సాధ్యం కాలేదు. పేదకుటుంబాల్లో తల్లిదండ్రులకు సెల్​ఫోన్లు, ట్యాబులు కొనే స్థోమత లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ రాకపోవడంతో ఆన్​లైన్​క్లాసులు, పవర్​కట్స్ వల్ల టీవీ పాఠాలు సక్సెస్​కాలేదు. సుమారు 17 నెలల పాటు ఫిజికల్ క్లాస్ లు జరగక పోవడంతో చాలా మంది స్టూడెంట్స్ బేసిక్స్ కూడా మరిచిపోయారు. స్టూడెంట్లు సబ్జెక్టులు మరిచిపోయారని, వారి బిహేవియర్ కూడా మారిపోయిందని వివిధ సర్వేలు వెల్లడించాయి. పిల్లల్ని మళ్లీ గాడిన పెట్టాలంటే ఫిజికల్ క్లాసులే దిక్కని స్పష్టం చేశాయి. దీంతో అన్ని సర్కారు బడుల్లో సెప్టెంబర్​1 నుంచి 40 రోజుల పాటు ‘రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్’(ఆర్​ఆర్​ఆర్​) ప్రోగ్రాం అమలు చేశారు. కానీ అప్పటికే గ్యాప్ బాగా రావడంతో స్టూడెంట్స్ బేసిక్స్, నేర్చుకోలేకపోయారని టీచర్లే చెబుతున్నారు.

సగం సిలబస్ కూడా కాలే

రాష్ట్రంలో జూన్​12తో అకడమిక్ ఇయర్ ప్రారంభం కావాలి. కానీ ఈసారి సెప్టెంబర్ 1 నుంచి సర్కారు బడుల్లో ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేశారు. జనవరి 8 నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అంటే మూడు నెలలే క్లాసులు నడిచాయి. మొదటి 40 రోజుల పాటు రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్’ ప్రోగ్రాంతోనే సరిపోయింది. మధ్యలో టీచర్ల ట్రాన్స్​ఫర్లు, జీవో 317 ఆందోళనల కారణంగా 20 రోజులు సరిగ్గా క్లాసులు జరగలేదు. 40 నుంచి 50 శాతం సిలబస్​ మాత్రమే పూర్తయిందని హెచ్ఎంలు, ఎడ్యుకేషన్​ఆఫీసర్లు చెబుతున్నారు. టెన్త్ క్లాస్ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. వీరికి మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో బేసిక్స్, ఫార్ములాస్, ఇంగ్లిష్, తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో గ్రామర్ పై పట్టు ఉంటేనే ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్ లకు ఆన్సర్ రాయగలుగుతారని, కానీ 9వ తరగతి అసలే చదవకపోవడం వల్ల ఆయా సబ్జెక్టులపై పూర్తిగా పట్టు కోల్పోయారని టీచర్లు చెబుతున్నారు. మొదటి 2 నెలలు ఫండమెంటల్స్ చెప్పడంతో సిలబస్​లో వెనుకబడ్డామని, మరో 50% సిలబస్ అలాగే ఉందని అంటున్నారు.

మళ్లీ టీవీ పాఠాలేనా?

ఫిబ్రవరి చివరి దాకా కరోనా తీవ్రత తగ్గేలా లేదని హెల్త్ ఆఫీసర్లు చెబుతుండడంతో సర్కారు బడి పిల్లలకు గతంలో మాదిరి టీవీ పాఠాలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రికార్డ్ చేసిన పాఠాలు ఉండడంతో వాటిని రీ ప్లే చేసేందుకు సర్కారు పర్మిషన్​ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీవీ పాఠాల్లో భాగంగా ఒక సబ్జెక్ట్ క్లాసు మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే వస్తోంది. అది కూడా అరగంటకే పరిమితం చేస్తున్నారు. ఆ టైంలో పవర్​కట్ ఉంటే అంతే సంగతులు. క్లాస్​తో ఒక్కసారి లింకు తెగిపోతే ఆ తర్వాతి క్లాసులు కూడా అర్థం కావట్లేదని స్టూడెంట్స్​చెబుతున్నారు. టీవీలో వచ్చే క్లాస్ ను స్టూడెంట్స్ వింటున్నారో లేదో పరిశీలించడానికిగానీ, పరీక్షించడానికి తమకు అవకాశం లేదని, అందువల్ల టీవీ పాఠాలు పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదని టీచర్లు అంటున్నారు. ఒకవేళ ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలని భావించినా 90 శాతం పిల్లలకు సెల్​ఫోన్స్​అందుబాటులో లేవని, గ్రామాల్లో నెట్​వర్క్​సమస్యతో అవి కూడా సక్సెస్​కావని చెబుతున్నారు. హైస్కూల్ లెవెల్​లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు క్లాసు రూముల్లో చెప్తే తప్ప అర్థం కావని అంటున్నారు. ఏమాత్రం అవకాశమున్నా ప్రభుత్వం ఫిజికల్ క్లాసులు నిర్వహించడమే మంచిదని, లేదంటే స్టూడెంట్స్ పరిస్థితి మరింత దిగజారుతుందని టీచర్స్ హెచ్చరిస్తున్నారు.

చదువుల మీద ప్రభావం

రెండేండ్లుగా స్కూళ్లకు దూరమై స్టూడెంట్స్ చదువులో వెనుకబడ్డారు. సెప్టెంబర్ లో క్లాసులు ప్రారంభమయ్యాక.. పిల్లలకు స్కూలు వాతావరణాన్ని, క్రమశిక్షణను అలవర్చడానికి కష్టపడుతున్నాం. ఈ టైమ్​లో మళ్లీ బడులను బంద్ చేయడం వల్ల స్టూడెంట్స్ గందరగోళానికి గురైతరు. ఈ నిర్ణయాన్ని సర్కారు పునరాలోచించాలి. 15 రోజులపాటు సెలవులు పొడగించడం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ క్లాసులు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలి.
- కనుకుంట్ల నవీన్ రెడ్డి, టీచర్, నోముల, సూర్యాపేట జిల్లా

సౌలతుల్లేకుంటే.. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ క్లాసులెట్ల?

గవర్నమెంట్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోంది. పిల్లల స్టాండర్డ్ పడిపోయింది. కొందరికైతే తాము ఏ క్లాసులో ఉన్నామో కూడా తెలుస్తలేదు. ఆన్ లైన్ క్లాసులతో చాలా మంది స్కూలు మానేశారు. సౌలతులు లేకుండా ఆన్​లైన్ క్లాసులంటే ఎట్లా చదువుకుంటారు. 
- నత్తి రఘుపతి, పేరెంట్, పోసానిపేట, సంగారెడ్డి​ జిల్లా

స్టాండర్డ్స్​పడిపోతయ్

జనవరి, ఫిబ్రవరి నెలలే స్టూడెంట్లకు కీలకం. సెలవుల పొడిగింపుతో విద్యా వ్యవస్థపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రెండేళ్లుగా ఎగ్జామ్స్ రాయకుండానే స్టూడెంట్లను పాస్ చేస్తున్నారు. దీనివల్ల స్టాండర్డ్స్​ పడిపోతాయి. కరోనా రూల్స్ పాటిస్తూ స్కూళ్లు నడపాలి.
- పోరెడ్డి దామోదర్ రెడ్డి, 
హెచ్ఎం, బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి జిల్లా

సడన్‌‌‌‌‌‌‌‌గా మూసేస్తే ఎట్ల?

నేను టెన్త్ చదువుతున్న. సెప్టెంబర్ నుంచి క్లాసులు నడుస్తున్నా.. సిలబస్ పూర్తి కాలేదు. సడన్ గా స్కూల్స్ మూసివేస్తే ఎట్ల? ఈసారి 10 జీపీఏ సాధించాలని గోల్​తో చదువుతున్నం. కరోనా రూల్స్ అమలు చేస్తూ స్కూళ్లు తెరవాలి.
- కె. ఐశ్వర్య, టెన్త్ క్లాస్, 
బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి జిల్లా

చదువులు రెండేండ్లు వెనక్కి

కరోనా వల్ల రెండేండ్ల చదువు దెబ్బతిన్నది. ఇప్పుడు ఎనిమిదో క్లాసులో ఉన్న స్టూడెంట్.. ఆరో క్లాస్ సామర్థ్యాలతోనే ఉంటున్నాడు. రెగ్యులర్ క్లాసులు నిర్వహించి, టీచర్లు రెండింతలు కష్టపడితే తప్ప వారి స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ పెరగవు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ క్లాసుల్లో శ్రద్ధ, ఏకాగ్రత అంతగా ఉండవు. అందువల్ల పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఆశించలేం. ఫిజికల్, మెంటల్ హెల్త్​, బ్యాక్​గ్రౌండ్, లెర్నింగ్ స్కిల్స్ మీద ఆధారపడి పిల్లల స్టాండర్డ్స్​ ఉం టాయి. కాబట్టి వారి స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ పెరగడానికి ప్రత్యక్ష తరగతులే మేలు.
‑ జి.కళావతి, హెచ్ఎం, సింగరాజుపల్లి, జనగామ జిల్లా