Childrens day special 2025: పిల్లల చదువులు.. టెక్నాలజీ ఒత్తిడి... దాగుడు మూతల దండాకోర్ ఎక్కడ ఉంది..!

Childrens day special 2025:   పిల్లల చదువులు.. టెక్నాలజీ ఒత్తిడి... దాగుడు మూతల దండాకోర్ ఎక్కడ ఉంది..!

నేటి సామాజిక పరిస్థితుల్లో బాలబాలికలు చదువుల పేరిట ఒత్తిడికి గురవుతున్నారు. ఆధునికంగా వచ్చిన టెక్నాలజీ వాళ్లకళ్లకు, కాళ్లకు బంధాలు వేస్తోంది. నేటి పిల్లలే రేపటి పౌరులు అన్న మాట మసక బారిపోతోంది..

చదువులు

నేటి పిల్లలకు చదువే ప్రపంచం అయిపోయింది. నిద్రలేవడం స్కూల్​ కు  రెడీ అవడం, సాయంత్రం తిరిగొచ్చాక మళ్లీ హోంవర్క్ చేసుకోవడం తర్వాత నిద్ర మధ్యలో ఖాళీ ఉంటే టీవీ చూడ్డం. ఇదే వారి రోజువారీ జీవితం. రాజ్యాంగం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ విద్య అందించాలి. కానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నప్పటి నుంచి వాళ్లకు చదువు తప్ప వేరే లోకం తెలియకుండా పెంచుతున్నారు. రెండు రెండన్నరేళ్లకే ఫ్రీ ప్రైమరీ అని స్కూల్లో చేరుస్తున్నారు. తరగతిలో అందరికన్నా ఫస్ట్ రావాలని కలలు కంటున్నారు. 

ఇక రెసిడెన్షియల్ స్కూళ్లల్లో అయితే. పిల్లలకు క్షణం తీరిక ఉండటం విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసం ఉన్నత వ్యక్తులతో కమిషన్ లాంటివి ఎన్ని వేసినా, వాళ్లు ఎన్ని సూచనలు చేసినా, అవి మాత్రం అమలు చేయడం లేదు .

తగినంత ఆవరణ విశాలమైన తరగతిగది, ఆటస్థలం.... ఏ స్కూల్లో ఉండటం లేదు. మార్కులే పరమావధిగా పిల్లలకు చదువు చెప్తున్నారు. వాళ్లలోని సృజనాత్మకతను వెలికితీయటం లేదు. బట్టీ పట్టిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తలకు మించిన భారం అయినా పిల్లల చదువులకోసం వేలు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వాళ్ల మానసిక స్థాయినీ, స్థితిని గురించి ఆలోచించడం లేదు. దాంతో బాలల జీవితం అయోమయంగా తయారైంది.

ఒత్తిళ్లు

ఈ రోజుల్లో పెద్దలే కాదు. చిన్నారులూ ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నారు. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారు. బడి, ట్యూషన్స్, హోం వర్క్ అంటూ చదువే లోకంగా బతికేస్తున్నారు. ఇక మార్కులు, ర్యాంకులు అంటూ బడిలో ఉపాధ్యాయులు ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్లను ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఏ మాత్రం ఆటవిడుపు కూడా లేకుండా పోయింది పిల్లలకు చిన్న వయసులో చదువు ఆట విడుపుగా ఉండాలి. 

కానీ భారం కాకూడదు. స్వచ్ఛంగా ఉన్న చిన్నారులు మనసుపై తెలియకుండానే అనేక ప్రభావాలు పడుతున్నాయి. చిన్నప్పటి నుంచే ఐఐటీలో సీటు సంపాదించాలని, మెడిసన్, ఇంజనీరింగ్ చదవాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. వాళ్లపై బలవంతంగా కలలను రుద్ది ఒత్తిడిని పెంచుతున్నారు. పదోతరగతి అంటే ఓ గండంలా భావిస్తున్నారు. మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఒత్తిళ్లతో నిత్యం సహవాసం చేస్తూ నిరాశ, భయం, ఆందోళనతో జీవిస్తున్నారు.

ఆటలు

పిల్లలకు ఆటలంటే ప్రాణం లేచి వస్తుంది.. ఒకప్పుడు బడిలో ఆటల పిరియడ్ తప్పని సరిగా ఉండే ప్రతి బడిలో పెద్ద పెద్ద ఆటస్థలాలు ఉండేవి పాతతరం ఆటలకు నేటి పిల్లలు దూరమవుతున్నారు. కబడ్డీ... కోతి కొమ్మచ్చి ..చిర్రా గోనె కుండాట, గోలీలాట, బొంగరాలు అచ్చనగాయలు.. ఎన్నో వాటివల్ల శారీరక వ్యాయామంతోపాటు మానసిక ఆనందం కూడా లభించేది. 

నేడు చాలా పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ లేవు. అట్టపెట్టెల్లాంటి గదుల్లో పిల్లలకు చదువులు చెప్పున్నారు. ఇక ఆటలు కూడా గదుల్లోనే, ఇండోర్ గేమ్స్ ఉన్నా ఔట్​ డోర్ గేమ్స్ అసలు ఆడించడం అంతంత మాత్రమే ఇక చిన్నారులకు ఇంటి దగ్గర ఆడుకునే సమయం ఉండటం లేదు. స్నేహితులూ ఉండటం లేదు. 

పాతరోజుల్లో సాయంత్రం పిల్లలు బడి నుంచి వచ్చిన తర్వాత, సెలవు రోజుల్లో తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా వీధుల్లో రకరకాల ఆటలు ఆడుకునే వాళ్లు . నేటి పిల్లలకు అంత సమయం తీరిక ఉండటం లేదు. ఒకవేళ ఏమాత్రం తీరిక ఉన్నా వీడియో గేమ్స్, టీవీ చూడటం... సెల్ ఫో కాలక్షేపం చేస్తున్నారు.అందువల్లే ఈ కాలం పిల్లల్లో ఊబకాయం లాంటి శారీరక సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు అంటున్నారు. మానసికంగా కూడా. ఉత్సాహం లేకుండా తయారవుతున్నారు.

రక్షణ

బాలబాలికలపై పలు రకాల దాడులు జరుగుతున్నాయి. దగ్గరి వాళ్లే వేధిస్తున్నారు. చిన్నారులను లైంగికంగా హింసిస్తున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.. బడిలో టీచర్ బంధువులు, పరిచయస్థులు ఎందరో పిల్లలను భౌతికంగా, మానసికంగా బాధిస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ www. neper.gov.in వెబ్​ సైట్ ను రూపొందించింది. 

పిల్లలు సులభంగా ఫిర్యాదు చేసేలా కార్టూన్ బొమ్మలతో ఈ వెబ్​ సైట్ ను తయారు చేశారు. ఫిర్యాదు వెళ్లగానే జిల్లా ఎస్పీ లేదా సగర కమిషనర్, స్త్రీశిశు అభివృద్ధి సంక్షేమశాఖకు వివరాలు అందుతాయి. ప్రత్యేక బృందాలు సీక్రెట్ గా విచారణ చేపడతారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా బాలల రక్షణ బాధ్యతలు చేపడుతున్నాయి.

హక్కులు

పిల్లలే కదా ఏదున్నా మాట్లాడలేరు ఎదురుతిరిగి దైర్యం లేదు అనుకుంటే పొరపాటే. బాలబాలికలకు ప్రత్యేక చట్టాలున్నాయి. 1989 నవంబర్ 20న ఐక్య రాజ్య సమితి బాలలకోసం 54 హక్కులను రూపొందించి వాటిని మానవ హక్కుల్లో భాగంగా చేర్చాలని తీర్మానించింది. మనదేశం 1992 డిసెంబర్ 11న వాటిని ఆమోదించింది.

 బాలబాలికలు అభివృద్ధి రక్షణ అందరి బాధ్యత జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెంచేహక్కు, భాగస్వామ్య హక్కు కల్పించింది. 18ఏళ్ల లోపున్న వారందరికీ ఈ హక్కులు వర్తిస్తాయి. 14 ఏళ్ల లోపున్న పిల్లలందరూ తప్పక ఉచిత విద్యను పొందే హక్కుంది. 

చిన్నారులు జాతి, కుల, మత, లింగ వివక్షకు గురికాకూడదు. బాలకార్మికుల చట్టం... వెట్టిచాకిరి నిరోధక చట్టం. ..బాల్యవివాహాల నిరోధక చట్టం లాంటివి పిల్లల కోసం ఏర్పడినవే. అలాగే బాలలకు న్యాయం రక్షణ భద్రత కల్పించడానికి జాతీయ బాలల హక్కుల కమీషన్ ఉంది. 2000 ఏడాదిలో బాలల న్యాయచట్టం వచ్చింది.