టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్ లో దూసుకెళ్తున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ పక్కనపెడితే టెస్టుల్లో మాత్రం ఈ టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ అదరగొట్టేస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్ లో ఒక వైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్ లో నిలకడగా రాణిస్తున్న జడేజా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. సఫారీలతో తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ టెస్టులో ఒక అరుదైన రికార్డ్ కు జడేజా చేరువలో ఉన్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేయడానికి జడేజా కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. తొలి టెస్టులో జడేజా మరో 10 పరుగులు చేస్తే సుదీర్ఘ ఫార్మాట్ లో 300 కంటే ఎక్కువగా వికెట్లు తీయడంతో పాటు 4000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ప్లేయర్ గా దిగ్గజాల సరసన నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. టీమిండియా ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ డేనియల్ వెట్టోరి.. ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ మాత్రమే బ్యాటింగ్ లో 4000 పైగా పరుగులు.. బౌలింగ్ లో 300 పైగా వికెట్లు పడగొట్టారు. త్వరలో జడేజా ఈ లిస్ట్ లో చేరడం ఖాయమైపోయింది.
ఓవరాల్ గా జడేజా టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 87 టెస్టుల్లో 118 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 38.74 యావరేజ్ తో 3990 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 163 ఇన్నింగ్స్ ల్లో 24 యావరేజ్ తో 338 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం, జడేజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో 400 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2022 నుంచి జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. మార్చి 9, 2022న జాసన్ హోల్డర్‌ను అధిగమించి టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా నిలిచాడు.
36 ఏళ్ల జడేజా భారత టెస్ట్ జట్టుకు మూలస్తంభంగా మారాడు. టెస్ట్ క్రికెట్ లో లోయర్ ఆర్డర్ లో కీలక పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. మార్చి 2022 నుండి రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు.
