ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ అంచనాలతో వస్తున్న ప్రాజెక్టు, దర్శకధీరుడు ఎస్ .ఎస్ . రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'గ్లోబ్ ట్రాటర్' ( SSMB29). ఈ మూవీ గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న ఈ అడ్వెంచర్ ఎపిక్.. హాట్ టాపిక్ గా మారింది. రోజు రోజుకు సరికొత్త హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. యూట్యూబ్ లో తన కామెడీ స్కిట్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆశిష్ చంచ్లానీ.. ఈచిత్రంలో భాగం కాబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
ఆశిష్ చంచ్లానీ మిస్టరీ పోస్ట్‌లు
హైదరాబాద్ లో 'గ్లోబ్‌ట్రాటర్' షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆశిష్ చంచ్లానీ కూడా ఇక్కడే ఉన్నాడని పుకార్లు మొదలయ్యాయి. అంతే కాకుండా ఆశిష్ స్వయంలో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, రాజమౌళి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' చిత్రంలోని ఐకానిక్ 'కట్టప్ప-బాహుబలి' హత్య సన్నివేశం యొక్క చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆతర్వాత తన X లో #JaiBabu అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశాడు. అనంతరం హైదరాబాద్ నుండి షేర్ చేసిన ఒక సెల్ఫీకి, "noveMBer is noveMBering too hard" అనే క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ "MB" అక్షరాలను ఫ్యాన్స్ వెంటనే మహేష్ బాబుకు ముడిపెట్టి, ఆశిష్ ఏదో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, ఈ సినిమా లాంచ్ ఈవెంట్‌లో పాల్గొంటాడని బలంగా నమ్ముతున్నారు అభిమానులు.
#JaiBabu ❤️🦁
— Ashish Chanchlani (@ashchanchlani) November 12, 2025
'మందాకిని'గా ప్రియాంక చోప్రా మాస్ ఎంట్రీ
మరోవైపు ఈ మూవీపై ఉత్కంఠను మరింత పెంచుతూ.. ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. గన్‌తో, ఎంతో పదునైన, పరాక్రమవంతమైన 'మందాకిని' పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు స్పష్టమైంది. రాజమౌళి, ప్రియాంక తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన ఈ పోస్టర్.. చాలా సంవత్సరాల తర్వాత ప్రియాంక భారతీయ సినిమాకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. ఆమె లుక్ అద్భుతంగా, చాలా శక్తివంతంగా ఉందని అభిమానులు కితాబిస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, మరో స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దిగ్గజ తారాగణం, రాజమౌళి విజన్ తోడైతే, ఈ చిత్రం ఒక చరిత్ర సృష్టించడం ఖాయం అని అంచనాలు వేస్తున్నారు సినీ వర్గాలు.
She’s more than what meets the eye… say hello to Mandakini. #GlobeTrotter@ssrajamouli @urstrulyMahesh @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @PrithviOfficial pic.twitter.com/3KqKnb2D5h
— PRIYANKA (@priyankachopra) November 12, 2025
భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీ..
ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డు సృష్టించనుంది. దాదాపు రూ. 965 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ కథ 'ఇండియానా జోన్స్' తరహా అడ్వెంచర్ సాగాల నుండి, ఆఫ్రికన్ అన్వేషణ కథల నుండి ప్రేరణ పొందిందని తెలుస్తోంది. మహేష్ బాబు ఒక సాహసోపేతమైన, కఠినమైన అన్వేషకుడి పాత్రలో కనిపిస్తారు. ఆయన ప్రాచీన రహస్యాన్ని కనుగొనేందుకు అన్వేషించని ప్రాంతాల గుండా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికా, ఒడిశాలతో పాటు హైదరాబాద్ లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమాలో ఆశిష్ చంచ్లానీ పాత్ర గురించి అధికారిక ప్రకటన వెలువడితే, ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న హైప్ మరింతగా పెరగడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
