బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2017లో ల్యాండ్ రికార్డ్స్ అప్ డేషన్ ప్రోగ్రామ్(ఎల్ఆర్ యూపీ) చేపట్టింది. ఎన్నికల ముందు రైతుబంధు వేయాలనే ఉద్దేశంతో రైతుల భూముల వివరాలను త్వరగా డిజిటలైజ్ చేయాలని అప్పటి ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి టార్గెట్స్ విధించడంతో అనేక తప్పులు దొర్లాయి. ఇవే లోపాలు ఇప్పటికీ రైతులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ధరణి పోర్టల్ ను మార్చేసి, భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ లోని భూముల డేటాను ఉన్నది ఉన్నట్లుగా భూభారతి పోర్టల్ లోకి అప్ లోడ్ చేశారు. దీంతో ధరణి పోర్టల్ లోని తప్పులే భూభారతిలోనూ కనిపిస్తున్నాయి.
4 సార్లు దరఖాస్తు చేస్తే రిజెక్ట్ చేసిన్రు..
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పలు సర్వే నంబర్లతో పాటు 144/బీ సర్వే నంబర్ లో ఎకరం 14 గుంటలు ఉండేది. బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన కొత్త పాస్ బుక్ లో ఎకరం ఎగిరిపోయి 14 గుంటలు మాత్రమే నమోదైంది. అలాగే 144/సీ సర్వే నంబర్ లో నా తండ్రి అవినాశ్ రెడ్డి పేరు మీద పాత పాస్ బుక్ లో అర ఎకరం భూమి ఉండేది. కొత్త పాస్ బుక్లో ఆ సర్వే నంబర్, అర ఎకరం భూమి మిస్సయింది. మాకు సంబంధించిన భూమి 144/సీ/1/1/1 అనే సర్వే నంబర్ లో శ్రీ పేరిట నమోదైంది. ఈ భూమిని మా పేరిట మార్చాలని మీ సేవలో ఇప్పటి వరకు రూ.4 వేలు చెల్లించి 4 సార్లు అప్లై చేసినా రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని అడిగితే తహసీల్దార్ సమాధానం చెప్పడం లేదు.
-- యర్రంరెడ్డి సంపత్ రెడ్డి, పర్వతగిరి, మహబూబాబాద్ -
